Photo Courtesy: IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నడూ లేనంత విపత్కర పరిస్థితులను ముంబై ఇండియన్స్ ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో (2022) ఎదుర్కొంటుంది . ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. క్యాష్ రిచ్ లీగ్‌లో రికార్డు స్థాయిలో ఐదు టైటిళ్లను కైవసం చేసుకున్న ముంబై జట్టు.. ఈ ఏడాది బోణీ విజయం కోసం ఎదురుచూసే ధీన స్థితికి చేరింది. ఆటగాళ్ల రిటెన్షన్, మెగా వేలంలో కీలక బౌలర్లను వదులుకోవడం ముంబై ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చేర్పులు చేయాలని భావించిన ముంబై యాజమాన్యం.. కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రోహిత్ సిఫార్సు మేరకు స్థానిక (ముంబై) ఆటగాడు, టీమిండియా బౌలర్ ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకునేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఈ ఏడాది మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన 33 ఏళ్ల ధవల్ కులకర్ణి ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో హిందీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముంబై, పూణేల్లో జరుగుతుండటంతో స్థానిక ఆటగాడిగా కులకర్ణి సేవలు తమ జట్టును గట్టెక్కిస్తాయని ముంబై సారధి అంచనా వేస్తున్నాడు. కులకర్ణికి ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్ మైదానాలతో పాటు పూణేలోని ఎంసీఏ స్టేడియంలోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉండటంతో రోహిత్ అతనిని ఎలాగైనా జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కులకర్ణి జట్టులో చేరితే ముంబై ఇండియన్స్ తిరిగి గాడిలో పడుతుందని రోహిత్ జట్టు యాజమాన్యాన్ని సైతం ఒప్పించినట్లు సమాచారం.
ధవల్ కులకర్ణి ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు పడగొట్టాడు. అతను గతంలో ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కులకర్ణి 2020, 21 సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉన్నాడు. అయితే ఈ ఏడాది మెగావేలంలో అతన్ని తిరిగి దక్కించుకునేందుకు ముంబై యాజమాన్యం ఆసక్తి చూపలేదు. కులకర్ణి టీమిండియా తరఫున 12 వన్డేలు, 2 టీ20లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ముంబై రేపు (ఏప్రిల్ 21) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
చదవండి: కరోనా కల్లోలం నడుమ ఢిల్లీ, పంజాబ్ వార్.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?
Comments
Please login to add a commentAdd a comment