ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై, ముంబై జట్ల మధ్య ఇవాళ (ఏప్రిల్ 21) జరుగనున్న ఆసక్తికర సమరం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోరు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రదర్శన ఆశించిన మేరకు లేనప్పటికీ, ఈ మ్యాచ్‌పై మాత్రం ఊహకందని హైప్ నెలకొంది. ఈ ఛాంపియన్ జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లు రసవత్తరంగా సాగడమే ఈ హైప్‌కు కారణం. ఐపీఎల్ అభిమానులు చెన్నై- ముంబై సమరాన్ని ఎల్ క్లాసికోగా భావిస్తారు.
ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఫాలోడ్ మ్యాచ్‌లుగా చెప్పుకునే చెన్నై-ముంబై మ్యాచ్‌లపై టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన భజ్జీ.. చెన్నై, ముంబై సమరాన్ని భారత్-పాక్ మధ్య జరిగే దాయదుల పోరుతో పోల్చాడు. ఈ రెండు జట్లను అతను ఐపీఎల్ జెయింట్స్‌గా అభివర్ణించాడు. భారత్-పాక్ మ్యాచ్ చూస్తే ఏ ఫీలింగ్ కలుగుతుందో ఈ ఇరు జట్ల మధ్య చూసినా అదే అనుభూతి కలుగుతుందని తెలిపాడు.
పైచేయి కోసం సీఎస్‌కే-ముంబై జట్లు ఆ స్థాయిలో పోటీపడతాయని అన్నాడు. పదేళ్లపాటు ముంబై జట్టుకు ఆడి ఆ తరువాత చెన్నైకి ప్రాతినిధ్యం వహించినప్పుడు విచిత్ర అనుభూతి కలిగిందని, తొలిసారి ముంబైకి ప్రత్యర్ధిగా బరిలోకి దిగినప్పుడు ఒత్తిడితో కూడిన భావోద్వేగానికి లోనయ్యానని గుర్తు చేసుకున్నాడు. తన దృష్టిలో చెన్నై, ముంబై జట్లు సమఉజ్జీలని చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్ లైవ్‌లో భజ్జీ ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఇదిలా ఉంటే, ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో చెన్నై నేటి మ్యాచ్‌లో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో (6) చెన్నై ఒకే ఒక్క విజయం నమోదు చేయగా, ముంబై.. బోణీ కూడా చేయలేని దుస్థితిలో ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగ్గా చెన్నై 19, ముంబై 13 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి.
చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌లోకి జూనియర్ మలింగ.. మిల్నే స్థానంలో ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment