
IPL 2022 Going To Impact RRR Business: మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2022) ప్రభావం, ఐదేళ్ల పాటు సినీ అభిమానులను ఊరిస్తూ ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో రిలీజైన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’పై పడనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. భారతీయులకు రెండు ప్రధాన కాలక్షేపాలైన సినిమా, క్రికెట్ ఒకే సమయంలో ప్రారంభమైతే రెండిటిపై ఎంతో కొంత ప్రభావం తప్పక ఉంటుందని ఇరు రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కోవిడ్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు 100 శాతం ప్రేక్షకులను(స్టేడియంలోకి) అనుమతించేది లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇదివరకే స్పష్టం చేసింది కాబట్టి, ఐపీఎల్‌తో పోలిస్తే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్‌లపైనే అధిక ప్రభావం తప్పదని వారు వాదిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానున్న నేపథ్యంలో సినిమా ఉదయం, మధ్యాహ్నం ఆటలపై ఎలాంటి ప్రభావం ఉండకపోయినా ఫస్ట్ షో, సెకండ్ షో కలెక్షన్లకు భారీగానే గండిపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు సినిమా పోగ్రాంను మానుకునేవాళ్లు చాలామందే ఉంటారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. సౌత్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మ్యాచ్‌లు శని (మార్చి 26), ఆదివారాల్లో (మార్చి 27) జరగనుండగా ఆ రోజుల్లో సినిమా కలెక్షన్లపై ప్రభావం తప్పదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రానున్న రెండు వారాలు ఐపీఎల్ వర్సెస్ ఆర్ఆర్ఆర్‌గా సాగనుందని అంటున్నారు.
కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్యతారగణంగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ సినిమా ‘రౌద్రం, రణం, రుధిరం’ (ఆర్ఆర్ఆర్) ఇవాళ (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదల కాగా, క్రికెట్ పండుగ ఐపీఎల్ రేపటి నుంచి (మార్చి 26) ప్రారంభంకానుంది. ఆర్ఆర్ఆర్‌కి పోటీగా మరో భారీ సినిమా థియేటర్లలో సందడి చేయకపోయినా.. ఐపీఎల్ 2022 రూపంలో జక్కన్ టీమ్ గట్టిపోటీ (కలెక్షన్ల రూపంలో) ఎదుర్కొననుంది.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment