భార్య నటాషాతో హార్దిక్ పాండ్యా
అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా నాలుగుసార్లు ఐపీఎల్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఐదోసారి ట్రోఫీని అందుకున్న అతనికి ఇది మరింత ప్రత్యేకం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా నాయకుడిగా మరో మెట్టెక్కాడు. కెప్టెన్ కావడం తన బాధ్యతను పెంచిందని, నాయకత్వాన్ని ప్రతీ క్షణం ఆస్వాదించానని అతను వ్యాఖ్యానించాడు.
‘అదనపు బాధ్యత తీసుకునేందుకు నేనెప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎప్పుడు అవకాశం లభించినా మిగతా వారిలో స్ఫూర్తి నింపేలా జట్టును ముందుండి నడిపించాలని భావించేవాడిని. నా జట్టు సహచరుల నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నానో వారికంటే ముందు నేను చేసి చూపించాలి. అలా చేస్తేనే దాని ప్రభావం ఉంటుంది. ఐపీఎల్‌లో నేను అలాగే చేశానని నమ్ముతున్నా’ అని పాండ్యా అన్నాడు. కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే సాధించిన ఐపీఎల్ ట్రోఫీకి తన దృష్టిలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని అతను చెప్పాడు.
‘గతంలో నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో ఉన్నాను. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఈసారి నా కెప్టెన్సీలో టైటిల్ గెలిచాం కాబట్టి సహజంగానే ఇది మరింతగా ఇష్టం. ఈ గెలుపు రాబోయే రోజుల్లో ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. ఫైనల్‌కు వెళ్లిన ఐదుసార్లూ కప్‌ను అందుకోగలిగిన నేను చాలా అదృష్టవంతుడిని. ఈ రోజు నాది. పైగా లక్షకు పైగా అభిమానులు మాకు అండగా నిలిచారు.
మా కష్టానికి దక్కిన ప్రతిఫలమిది’ అని ఈ ఆల్‌రౌండర్ విశ్లేషించాడు. టి20లు బ్యాటర్ల ఆట మాత్రమే అని చాలా మంది అనుకుంటారని, అయితే ఈ ఫార్మాట్‌లో బౌలర్లే మ్యాచ్ గెలిపించగలరని హార్దిక్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో తగినంత స్కోరు లేని సమయంలోనూ మంచి బౌలర్లు ఉంటే మ్యాచ్‌ను మలుపు తిప్పగలరని అతను అన్నాడు. హార్దిక్ పాండ్యా తన తదుపరి లక్ష్యం ప్రపంచకప్ గెలుచుకోవడమే అని ప్రకటించాడు.
టీమిండియా తరఫున మూడు ఐసీసీ టోర్నీలలో భాగంగా ఉన్నా... ఒక్కసారి కూడా అతనికి విజయానందం దక్కలేదు. ‘ఎవరికైనా భారత జట్టు తరఫున ఆడటమనేది ఒక కల. నేను ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి మనోళ్ల అభిమానాన్ని చూరగలిగాను. ఇక టీమిండియా సభ్యుడిగా వరల్డ్‌కప్ గెలుపులో భాగం కావడమనేదే నా లక్ష్యం. అందుకోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. నేను ఏ రకంగా జట్టుకు ఉపయోగపడినా చాలు’ అని హార్దిక్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ వేదికలకు నజరానా
ఈ ఐపీఎల్ సీజన్‌లో జరిగిన 74 మ్యాచ్‌లను సమర్థంగా నిర్వహించడంతో పాటు చక్కటి పిచ్‌లను రూపొందించిన ఆరు వేదికలకు బీసీసీఐ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ముంబైలోని వాంఖెడే, బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు పుణేలోని ఎంసీఏ మైదానంలో లీగ్ దశ మ్యాచ్‌లు జరగగా... కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాలు ప్లే ఆఫ్స్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. లీగ్ మ్యాచ్‌లు జరిగిన స్టేడియాలు ఒక్కో దానికి రూ.25 లక్షలు, ప్లే ఆఫ్స్ నిర్వహించిన మైదానాలకు ఒక్కోదానికి రూ. 12.5 లక్షల చొప్పున బహుమతిని బోర్డు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment