IPL 2022, MI vs LSG: Parthiv Patel Slams Krunal Pandya For Kieron Pollard Send-off - Sakshi
Sakshi News home page

Krunal Pandya: పొలార్డ్‌కు ముద్దు పెట్టి సెండాఫ్‌.. కృనాల్‌ ‘ఓవరాక్షన్‌’పై మాజీల మండిపాటు

Published Mon, Apr 25 2022 1:01 PM | Last Updated on Wed, Apr 27 2022 2:59 PM

IPL 2022 MI Vs LSG: Parthiv Patel Slams Krunal Pandya Send Off To Pollard - Sakshi

పొలార్డ్‌ను అవుట్‌ చేశాక కృనాల్‌ సెలబ్రేషన్‌(PC: IPL/BCCI)

IPL 2022 MI Vs LSG- Krunal Pandya- Kieron Pollard: లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడు కృనాల్‌ పాండ్యా తీరును టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పార్థివ్‌ పటేల్‌ విమర్శించాడు. ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలంటూ హితవు పలికాడు. స్నేహితుడే కదా అని ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని, ఎదుటివారి మనోభావాలను గౌరవించాలని సూచించాడు. కాగా ముంబై ఇండియన్స్‌, లక్నో జట్ల మధ్య ఆదివారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో లక్నో ముంబైపై 36 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, చివరి ఓవర్‌లో కృనాల్‌ పాండ్యా.. ముంబై ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. తొలుత లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా పొలార్డ్‌ కృనాల్‌ పాండ్యాను అవుట్‌ చేశాడు. ఇక ముంబై లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్‌ వికెట్‌ను కృనాల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్‌ వీపు పైకి దుమికి కృనాల్‌ అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. అయితే, పొలార్డ్‌ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్‌ చేరాడు. ఈ ఘటనపై స్పందించిన పార్థివ్‌ పటేల్‌ క్రిజ్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘కృనాల్‌, పొలార్డ్‌ మంచి స్నేహితులు. కానీ, ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి.

పొలార్డ్‌ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్‌ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో ‘స్నేహితుల’తో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ.. మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్‌ నాకైతే మరీ ఓవర్‌గా అనిపిస్తోంది’’ అని కృనాల్‌ తీరును తప్పుబట్టాడు.

ఇక మరో మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిది. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. ఒకవేళ పొలార్డ్‌ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేది?

తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్‌ ఇలా చేయడం నిజంగా టూ మచ్‌’’ అని కృనాల్‌ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. కాగా గతంలో పొలార్డ్‌, కృనాల్‌ ఒకే ఫ్రాంఛైజీ(ముంబై)కి ఆడారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్‌-2022లో భాగంగా ప్రత్యర్థులుగా మైదానంలోకి దిగుతున్నారు. ఇక భారీ హిట్టర్‌గా పేరొందిన పొలార్డ్‌ ఈ సీజన్‌లో ఆకట్టుకోలేకపోతున్నాడు.

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడికి తాజా ఐపీఎల్‌ ఎడిషన్‌ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 115 పరుగులు(అత్యధిక స్కోరు: 25) చేసిన ఈ వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌.. 3 వికెట్లు తీశాడు. ఇక లక్నోతో మ్యాచ్‌లో పొలార్డ్‌ చేసిన స్కోరు: 20 బంతుల్లో 19 పరుగులు.  ఇదిలా ఉంటే.. ముంబై వరుసగా ఎనిమిదో ఓటమి మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. దీంతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఈ జట్టు నిష్క్రమించినట్లయింది.

చదవండి👉🏾 Trolls On Ishan Kishan: ధర 15 కోట్లు.. ఇషాన్‌ ఇదేమైనా టెస్టు మ్యాచ్‌ అనుకున్నావా? పాపం ముంబై ఫ్రాంఛైజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement