
ముంబై: విశ్వవ్యాప్త ఆదరణతో టాప్ క్రికెట్ లీగ్‌గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు అమెరికన్ల పెట్టుబడుల్ని ఆకర్షించడంలో సఫలమైంది. ఐపీఎల్ తొలి చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) దిగ్గజం లారీ ఫిట్జెరాల్డ్, స్టార్ ప్లేయర్ కెల్విన్ బీచుమ్, నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) స్టార్ క్రిస్ పాల్ పెట్టుబడులు పెట్టారు. ‘అమెరికా ఎలైట్ అథ్లెట్లు క్రిస్ పాల్, ఫిట్జెరాల్డ్, కెల్విన్‌లను పెట్టుబడులు పెట్టేలా మా ఫ్రాంచైజీ ఆకర్షించింది. ఈ ముగ్గురు తాజాగా మా స్టేక్ హోల్డర్ల జాబితాలో చేరారు. మైనార్టీ ఇన్వెస్టర్లుగా మా బోర్డులో భాగమయ్యారు’ అని రాజస్తాన్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.
మనోజ్ బదాలేకు చెందిన ‘ఎమర్జింగ్ మీడియా వెంచర్స్’ ఈ ఫ్రాంచైజీ యజమాని కాగా... అమెరికన్ దిగ్గజాలు తమ ఫ్రాంచైజీలో భాగస్వాములవడం సంతోషంగా ఉందని బదాలే అన్నారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. పెద్ద స్టార్లతో గొప్ప మేలే జరుగుతుందన్నారు. ‘రాజస్తాన్‌ను ఓ ప్రొఫెషనల్ ఫ్రాంచైజీగా తయారు చేయాలనే ఆలోచనతో ఇందులో భాగమయ్యాను’ అని ఫిట్జెరాల్డ్ తెలిపాడు. ఐపీఎల్ ఎంతగా ఎదిగిందో తెలుసని, విలువ పరంగా ఈ లీగ్ అంతకంతకూ వృద్ధి చెందుతోందని, నిజంగా ఇలాంటి విశేష ప్రాచుర్యంగల లీగ్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉందని క్రిస్ పాల్ అన్నాడు. రాయల్స్ ఇటీవల విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది బార్బడోస్ ట్రైడెంట్స్, సీఎంజీ కంపెనీలు రాజస్తాన్‌లో పెట్టుబడులు పెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment