photo courtesy to IPL
Punjab Kings: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో బ్యాటర్లు చెలరేగి ఆడటంతో రెండు మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో 38.2 ఓవర్లలోనే 356 పరుగులు నమోదు కాగా.. ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 413 పరుగులు (39 ఓవర్లలో) రికార్డయ్యాయి. ఇరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే (ముంబై 177/5, ఆర్సీబీ 205/2) భారీ స్కోర్లు నమోదు చేశాయనుకుంటే, ఛేదనకు దిగిన జట్లు (డీసీ 179/6, పంజాబ్ 208/5) మరింత రెచ్చి పోయి కొండంత లక్ష్యాలను సునాయాసంగా ఊదేశాయి.
ముఖ్యంగా ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోటీపడి పరుగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (57 బంతుల్లో 88; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 41; ఫోర్, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఏమాత్రం తగ్గేదిలేదంటూ లక్ష్యాన్ని ఊదేసింది.
Odean Smith's strike-rate in that innings sits inside the top 20 in IPL history (min. 25 runs)
— Wisden (@WisdenCricket) March 27, 2022
An incredible tournament debut 💥#IPL2022 pic.twitter.com/KTbJ4xzHQl
పంజాబ్ జట్టులో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32), శిఖర్ ధవన్ (43), భానుక రాజపక్స (43), లియామ్ లివింగ్‌స్టోన్ (19), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 24 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఒడియన్ స్మిత్ (8 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) తలో చేయి వేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.
అయితే, పంజాబ్ ఇంతలా రెచ్చిపోయి కొండంత లక్ష్యాన్ని కరిగించడానికి ఓ సినిమా కారణమని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఓడియన్ స్మిత్ వెల్లడించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు పంజాబ్ ఆటగాళ్లు 14 పీక్స్ అనే నేపాలీ ఇంగ్లీష్ మూవీ చూశారట. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ అనే ట్యాగ్‌లైన్ కలిగిన ఈ మూవీ పంజాబ్ ఆటగాళ్లలో స్పూర్తిని రగిలించిందని స్మిత్ పేర్కొన్నాడు. ఏడు నెలల కాలంలో మౌంట్ ఎవరెస్ట్ సహా 14 అత్యున్నత పర్వతాలను అధిరోహించడం అనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ సినిమాను జట్టు కోచ్ అనిల్ కుంబ్లే ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయించాడని, ఈ సినిమా ఇచ్చిన ఊపుతోనే భారీ టార్గెట్‌ను ఊదేయగలిగానని స్మిత్ వ్యాఖ్యానించాడు.
14 పీక్స్ లాగే తాము కూడా 14 మ్యాచ్‌ల అవరోధాన్ని అధిరోహిస్తామని, ప్రస్తుతం తొలి అవరోధాన్ని అధిగమించామని స్మిత్ పేర్కొన్నాడు. కాగా, ఛేదనలో సిరాజ్ వేసిన 18వ ఓవర్‌లో స్మిత్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఏకంగా 3 సిక్సర్లు, ఫోర్ సహా 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసి పంజాబ్ విజయానికి దోహదపడింది.
చదవండి: ఓటమిని తట్టుకోవడం కష్టమే.. అయితే: విరాట్ కోహ్లి ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment