MI VS PBKS: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 13) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓడి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్.. పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది.
ఈ కీలక సమరానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులపై కన్నేశాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 25 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌లో అతిపెద్ద మైలురాయిని చేరుకుంటాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 9975 పరుగులు (372 మ్యాచ్‌ల్లో) సాధించిన రోహిత్.. నేటి మ్యాచ్‌లో మరో పాతిక పరుగులు చేస్తే ప్రపంచ క్రికెట్‌లో 10000 పరుగుల మార్కును అందుకున్న ఏడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, ఓవరాల్‌గా మరో ఐదుగురు మాత్రమే టీ20ల్లో ఈ అరుదైన మైలురాయిని అధిగమించగలిగారు.
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 463 మ్యాచ్‌ల్లో 14562 పరుగులతో టీ20ల్లో టాప్ రన్ స్కోరర్‌గా చలామణి అవుతుండగా, పాక్ వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ (472 మ్యాచ్‌ల్లో 11698 పరుగులు), విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ (582 మ్యాచ్‌ల్లో 11430 పరుగులు), ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ (347 మ్యాచుల్లో 10444 పరుగులు), టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (328 మ్యాచుల్లో 10326 పరుగులు), ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10308 పరుగులు) వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఈ రికార్డుతో పాటు నేటి మ్యాచ్‌కు ముందు హిట్‌మ్యాన్‌ను మరో రికార్డు కూడా ఊరిస్తుంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో రోహిత్ మరో ఫోర్ బాదితే ఐపీఎల్‌లో 500 ఫోర్లు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో నాలుగు వరుస పరాజయాలతో కుంగిపోయి ఉన్న ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు మరో 2 అపజయాలను ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్ సైతం ఈ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుంటుంది.
చదవండి: IPL 2022: ఆర్సీబీ టైటిల్ నెగ్గే వరకు ఆ అమ్మడు పెళ్లి చేసుకోదట..!
Comments
Please login to add a commentAdd a comment