
Photo Courtesy: IPL
Bhuvaneshwar Kumar: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 11) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ చెత్త బౌలింగ్ రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ బౌల్ చేసిన భువీ.. వైడ్‌ల రూపంలో 11 పరుగులు (5+5+1), ఓ లెగ్ బై సహా మొత్తం 17 పరుగులు సమర్పించుకుని, ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యంత విలువైన తొలి ఓవర్‌ను బౌల్ చేశాడు. 2015లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ తొలి ఓవర్‌లో 17 పరుగులు సమర్పించుకోగా, తాజాగా భువీ స్టెయిన్ పేరిట ఉన్న చెత్త ఐపీఎల్ రికార్డును సమం చేశాడు. ఈ ఓవర్‌లో భువీ ఏకంగా 9 బంతులు సంధించి, ప్రస్తుత సీజన్‌లో సుదీర్ఘమైన ఓవర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
భువీ వేసిన ఈ ఓవర్‌లో గుజరాత్ ఓపెనర్లు మాథ్యూ వేడ్ (4; ఫోర్), శుభ్‌మన్ గిల్ (1) 5 పరుగులు మాత్రమే సాధించగా మిగతా పరుగులు (15) ఎక్స్‌ట్రాల రూపంలో ప్రత్యర్ధికి కలిసొచ్చాయి. ఆరేళ్ల పాటు వన్డేల్లో ఒక్కసారి కూడా గీత దాటని (నో బాల్స్) భువీ.. తాజా ఐపీఎల్ సీజన్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం విశేషం. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భువీ పోటీపడి నో బాల్స్ సంధించి ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి పరోక్ష కారణమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శతక్కొట్టిన జోస్ బట్లర్.. భువీ నో బాల్ కారణంగా ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు.
ఇదిలా ఉంటే, గుజరాత్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్ తర్వాత తేరుకున్న భువీ.. రెండో ఓవర్‌లో ఇన్ ఫామ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను, ఆఖర్లో అభినవ్ మనోహర్‌ను ఔట్ చేసి, ప్రత్యర్ధి భారీ స్కోర్ సాధించకుండా కట్టడి చేయగలిగాడు. భువీ (2/37), నటరాజన్ (2/34), మార్కో జన్సెన్ (1/27), ఉమ్రాన్ మాలిక్ (1/39) ధాటికి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా, ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌కు అభినవ్ శర్మ (42), కేన్ విలియమ్సన్ (57) అదిరిపోయే ఆరంభాన్ని అందించి మ్యాచ్‌ను గెలిపించారు. ఆఖర్లో పూరన్ (18 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (8 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్) చెలరేగి ఎస్‌ఆర్‌హెచ్‌ను విజయతీరాలకు చేర్చారు.
చదవండి: వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్‌ఆర్‌హెచ్ కదా
Comments
Please login to add a commentAdd a comment