IPL 2022: Netizens Fire on Virat Kohli Aggressive Celebration After MS Dhoni Wicket - Sakshi
Sakshi News home page

MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’

Published Thu, May 5 2022 10:59 AM | Last Updated on Thu, May 5 2022 4:09 PM

IPL 2022: Trolls On Virat Kohli Aggressive Celebration MS Dhoni Dismissal - Sakshi

ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి(PC: IPL/Disney+Hotstar)

IPL 2022 CSK Vs RCB: టీమిండియా మాజీ కెప్టెన్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై అభిమానులు మండిపడుతున్నారు. ‘నీ నుంచి ఇలాంటి చెత్త ప్రవర్తన ఊహించలేదు’’ అని... నీ ఫ్యాన్స్‌ అని చెప్పుకోవడానికి సిగ్గు పడే పరిస్థితి తెచ్చావంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇక భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ సారథి ధోని ఫ్యాన్స్‌ అయితే కోహ్లి తీరుపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘నీ స్థాయి ఏమిటో నిరూపించుకున్నావు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐపీఎల్‌-2022లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆర్సీబీ మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ ధోని తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్‌ కోహ్లి 33 బంతుల్లో 30 పరుగులు చేసి మొయిన్‌ అలీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అంతకు ముందు తప్పుడు నిర్ణయంతో సహచర ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రనౌట్‌(ఊతప్ప/ధోని) అయ్యేలా చేశాడు. 

ఇదిలా ఉండగా లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(28), డెవాన్‌ కాన్వే(56) శుభారంభం అందించారు. ఊతప్ప(1), అంబటి రాయుడు(10) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. ఇక మొయిన్‌ అలీ 34 పరుగులతో రాణించగా జడేజా 3 పరుగులకే అవుటయ్యాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ‘ఫినిషర్‌’ ధోని 19వ ఓవర్‌ మొదటి బంతికే జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రజత్‌ పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

ఈ సందర్బంగా కోహ్లి సెలబ్రేట్‌ చేసుకున్న విధానమే అతడిపై విమర్శలకు కారణమైంది. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ధోని 2 పరుగులకే అవుట్‌ కావడంతో ఆర్సీబీ శిబిరంలో సంతోషం నిండింది. ఇక కోహ్లి సైతం అభ్యంతరకర భాష వాడుతూ సెలబ్రేట్‌ చేసుకున్నట్లుగా కనిపించిందంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో.. ‘‘ధోని పట్ల నీకున్న గౌరవం ఇదా! అసలు ఏమనుకుంటున్నావు? నీ తప్పిదం వల్ల రనౌట్‌ జరిగింది. ఊతప్ప వేసిన బంతిని ఒడిసిపట్టి ధోని మాక్సీని అవుట్‌ చేశాడు. ఆటను ఆటగా చూడాలే తప్ప భావోద్వేగాలు.. అది కూడా మరీ ఇంత నీచంగా ప్రదర్శించాలా?’’ అంటూ నెటిజన్లు కోహ్లిని ఏకిపారేస్తున్నారు. ఇందులో కొంతమంది కోహ్లి ఫ్యాన్స్‌ కూడా ఉండటం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. 

ఐపీఎల్‌ మ్యాచ్‌ 49: ఆర్సీబీ వర్సెస్‌ చెన్నై స్కోర్లు
ఆర్సీబీ-173/8 (20)
చెన్నై-160/8 (20)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement