జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు.. కావాల్సినంత పాపులారిటీ.. ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే.. అయినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న లోటు తీర్చుకోలేకపోతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. 2013 సీజన్ నుంచి పూర్తి స్థాయిలో ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లి.. టైటిల్ గెలవకుండానే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఐపీఎల్-2021 తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో అనేక తర్జనభర్జనల అనంతరం దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను సారథిగా ఎంపిక చేసింది ఆర్సీబీ యాజమాన్యం.
ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా జరిపిన చర్చలో మాట్లాడుతూ.. ‘‘ఫాఫ్ ఐపీఎల్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు మూడేళ్ల పాటు ఆడతాడేమో! ఏదేమైనా... ఫాఫ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం సరైన నిర్ణయం. అతడి అనుభవం జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎంఎస్ ధోనిలోని కెప్టెన్సీ నైపుణ్యాలు తనలోనూ ఉన్నాయని అతడే చెప్పాడు కూడా. అయితే, ఫాఫ్ ఎక్కువ కాలం పాటు కెప్టెన్‌గా ఉండకపోవచ్చు. నిజానికి గత కొన్నేళ్లుగా కోహ్లి కెప్టెన్సీ భారంతో ఒత్తిడికి గురవుతున్నాడు. అతడికి కాస్త విశ్రాంతి కావాలి. నాకు తెలిసి కోహ్లి చిన్న బ్రేక్ తీసుకున్నాడనిపిస్తోంది. నా అంచనా ప్రకారం.. వచ్చే ఏడాది అతడు మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి’’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment