కోహ్లి- గంభీర్ (PC: IPL/BCCI)
IPL 2023 LSG Vs RCB- #ViratGambhirFight: ఐపీఎల్-2023లో విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ వివాదం గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ స్పందించాడు. మైదానంలో ఆటగాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమని.. ఇందులో కోచ్‌లు జోక్యం చేసుకోవడం సరికాదని విమర్శించాడు. ఎవరికి అప్పజెప్పిన బాధ్యతలు వాళ్లు సక్రమంగా నెరవేరిస్తే బాగుంటుందని పరోక్షంగా గౌతం గంభీర్‌పై విమర్శనాస్త్రాలు సంధించాడు.
చర్యకు ప్రతిచర్య
లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ కోహ్లి- లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం వివాదానికి దారితీసింది. గత మ్యాచ్‌లో తమ అభిమానులను ఉద్దేశించి గంభీర్ చేసిన సైగలకు కౌంటర్‌గా కోహ్లి లక్నో గ్రౌండ్‌లో దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాడు.
సద్దుమణగాల్సింది.. పెద్దదైంది
ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్- నవీన్ ఉల్ హక్ మధ్య మొదలైన వివాదం కోహ్లి జోక్యంతో పెద్దదైంది. లక్నోపై విజయం తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు ప్రత్యర్థి ప్లేయర్లతో కరచాలనం చేస్తున్నపుడు నవీన్- కోహ్లి మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో లక్నో ఓపెనర్ కెయిలీ మేయర్స్ కోహ్లితో మాట్లాడుతుండగా.. గంభీర్ ఆపే ప్రయత్నం చేసే క్రమంలో గొడవ మరింత పెద్దదైంది.
కోహ్లి- నవీన్ వార్ కాస్త కోహ్లి వర్సెస్ గంభీర్‌గా మారిపోయింది. దీంతో స్థాయికి తగ్గట్లు హుందాగా ప్రవర్తించకుండా ఇద్దరూ దిగజారిపోయారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కొంతమంది కోహ్లికి, మరికొంత మంది గంభీర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
కోచ్‌లు డగౌట్‌లో ఉండాలి
ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ సైతం స్పందిస్తూ.. ఆటగాళ్ల మధ్య వివాదం తలెత్తితే కోచ్‌లు మధ్యలో దూరిపోవాల్సిన అవసరం లేదంటూ గంభీర్ తీరును విమర్శించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ పోస్ట్ మ్యాచ్ షోలో మాట్లాడుతూ.. ‘‘మైదానంలో ఆటగాళ్లు ఒక్కోసారి గొడవ పడటం సహజం.
ఆటలో భావోద్వేగాలు కూడా మిళితమై ఉంటాయి. అలా అని ప్రతిరోజూ ఇలాంటి వివాదాలు జరగవు కదా! ఏదేమైనా ఇలాంటివి జరిగినపుడు కోచ్‌లు సంయమనం పాటించాలి. కోచ్‌లు లేదంటే ఇతర సహాయ సిబ్బంది ఆటలో ఎందుకు జోక్యం చేసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు.
మధ్యలో దూరి ఇలా
మైదానంలో జరిగింది మైదానం వరకే పరిమితం చేయాలి. అంతేగానీ గొడవ పెద్దది చేయాలని చూడకూడదు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరుగుతుంటే.. వాళ్లే కాసేపటి తర్వాత సర్దుకుంటారు. అంతేగానీ డగౌట్‌లో కూర్చోవాల్సిన కోచ్‌లు వెళ్లి మధ్యలో దూరిపోకూడదు. డ్రెస్సింగ్ రూంలో నుంచి గమనిస్తూ పరిస్థితిని గమనించి అందుకు తగ్గట్లు గొడవ చల్లారేలా చేయాలి’’ అని మైకేల్ వాన్ వ్యాఖ్యానించాడు.
చదవండి: లక్షలు పోసి కొంటే రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు! 4 కోట్లు తీసుకున్న నువ్విలా.. వేస్ట్
నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్
చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు..
Comments
Please login to add a commentAdd a comment