చెన్నై గెలుపొందగానే జడేజాను ఎత్తుకుని ధోని సెలబ్రేషన్ (PC: IPL)
IPL 2023 Winner CSK- MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరే ఓ ఎమోషన్.. బ్యాటింగ్ చేసినా చేయకపోయినా మైదానంలో తలా ఉంటే చాలు.. అదే మహా భాగ్యం అన్నట్లు మురిసిపోయే అభిమానులకు లెక్కేలేదు. సాధారణంగా భావోద్వేగాలను ఎక్కువగా బయటపెట్టని ఈ మిస్టర్ కూల్ ఐపీఎల్-2023 ఫైనల్ సందర్భంగా మాత్రం ఉద్వేగానికి లోనయ్యాడు.
గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం నాటి తుదిపోరులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫోర్ బాది జట్టుకు విజయం అందించగానే ధోని కళ్లల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి. విన్నింగ్ షాట్ కొట్టగానే జడ్డూ డగౌట్ దిశగా పరిగెత్తుకు రాగా.. ఒక్కసారిగా అతడిని ఎత్తుకున్నాడు ధోని.
విభేదాలంటూ వార్తలు
సంతోషం పట్టలేక తన తమ్ముడిలాంటి జడేజాను అభినందిస్తూ తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా ధోని- జడేజా మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చిన జడ్డూ
ఓ మ్యాచ్‌లో తలా.. జడ్డూపై సీరియస్ కావడం.. ధోనికి ఇదే చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో సొంత జట్టు అభిమానులే ధోని కోసం జడేజా త్వరగా అవుటవ్వాలని కోరుకోవడం వంటి పరిణామాల నడుమ.. ఇప్పటికైనా.. ‘‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఎవరో తెలుసుకోండి’’ అంటూ జడేజా ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇవ్వడం సందేహాలకు తావిచ్చింది.
నచ్చిన దారిలో వెళ్లమన్న రివాబా
ఈ నేపథ్యంలో జడేజా వేరే ఫ్రాంఛైజీకి మారే ఆలోచనలో ఉన్నాడంటూ వదంతులు వ్యాపించాయి. ఒక సందర్భంలో జడ్డూ భార్య రివాబా సైతం భర్తకు అండగా.. ‘‘నీకు నచ్చిన దారిలో వెళ్లు’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వీటిని మరింత బలపరిచాయి.
మీరిలాగే కలిసి ఉండాలి
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ధోని.. జడ్డూను ఆత్మీయంగా హత్తుకుని ఎత్తుకున్న దృశ్యాలు అభిమానులకు కనుల విందుగా మారాయి. ‘మీరెప్పుడూ ఇలాగే ఉండాలి. మీ గురించి వచ్చిన వార్తలు వట్టి వదంతులే అని తేలిపోవాలని కోరుకుంటున్నాం’’ అంటూ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
నెట్టింట వీడియో వైరల్
ధోని- జడ్డూ అనుబంధానికి అద్దం పట్టినట్లుగా ఉన్న ఈ వీడియో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సోమవారం రిజర్వ్ డే మ్యాచ్‌లోనూ వర్షం అడ్డుపడిన కారణంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో విజేతను నిర్ణయించారు.
విన్నింగ్ షాట్ కొట్టిన జడ్డూ
నరేంద్ర మోదీ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 214 పరుగుల భారీ స్కోరు చేసింది. వరుణుడి కారణంగా సీఎస్‌కే 15 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి ఉండగా.. జడేజా ఫోర్ బాది చెన్నైకి విజయం అందించాడు. దీంతో ఐదోసారి ట్రోఫీ అందుకున్న సూపర్‌కింగ్స్ సంబరాలు అంబరాన్నంటాయి. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే(25 బంతుల్లో 47 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో మూడు శతకాలు నమోదు చేసిన గుజరాత్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అత్యధిక పరుగుల వీరుడి(890)గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అదే జట్టుకు చెందిన మహ్మద్ షమీ అత్యధిక వికెట్ల(28)తో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.
M.O.O.D! 🤗
— IndianPremierLeague (@IPL) May 29, 2023
Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd
Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023
Comments
Please login to add a commentAdd a comment