Photo Credit: IPL Twitter
పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. భుజం గాయంతో బాధపడుతూ సీజన్ మొత్తానికే దూరమైన యువ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బవా స్థానంలో పంజాబ్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గుర్నూర్ సింగ్ బ్రార్‌ను ఎంపిక చేసుకుంది పీబీఎస్‌కే యాజమాన్యం. బ్రార్‌ను బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకున్నట్లు పంజాబ్ యాజమాన్యం వెల్లడించింది. గత ఐపీఎల్ సీజన్ (2022) రెండు మ్యాచ్‌లు ఆడిన బవా.. ప్రస్తుత ఎడిషన్ ప్రారంభానికి ముందే గాయపడిన విషయం తెలిసిందే.
(రాజ్ అంగద్ బవా)
గుర్నూర్ సింగ్ బ్రార్ విషయానికొస్తే.. ఈ పంజాబ్ ఆల్‌రౌండర్ 2022 డిసెంబర్‌లో పంజాబ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ తరఫున ఇప్పటివరకు 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన బ్రార్ 120.22 స్ట్రయిక్‌రేట్‌తో 107 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 3.80 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు.
(గుర్నూర్ సింగ్ బ్రార్)
ఇదిలా ఉంటే, రన్నింగ్ ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో కేకేఆర్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భానుక రాజపక్ష (50), కెప్టెన్ శిఖర్ ధవన్ (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన కేకేఆర్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.
వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్థతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. 3 వికెట్లు పడగొట్టిన కేకేఆర్ పతనానికి బీజం వేసిన అర్షదీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment