కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టి మాంచి ఊపు మీద ఉన్న సన్‌రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌పై ప్రస్తుతం అందరి కళ్లు ఉన్నాయి. ఇవాళ (ఏప్రిల్ 18) ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బ్రూక్ ఎలా ఆడతాడో అని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రూక్‌కు సంబంధించిన ఓ బలహీనతపై నెట్టింట డిబేట్లు జరుగుతున్నాయి.
అరంగేట్రం ఐపీఎల్ సీజన్‌లో ఆడిన తొలి 3 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై, కేకేఆర్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్రూక్.. కేకేఆర్‌తో మ్యాచ్ సహా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో స్పిన్నర్లకు ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. బ్రూక్.. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 13 పరుగులు చేసి చహల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ కాగా.. ఆతర్వాతి మ్యాచ్‌లో (లక్నో) 3 పరుగులు చేసి బిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.
అనంతరం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డ బ్రూక్.. ఆ మ్యాచ్‌లో అర్షదీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. తాజాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ శతక్కొట్టినప్పటికీ స్పిన్నర్లకు ఎదుర్కోవడంలో అతని లోపాలు స్పష్టం బయటపడ్డాయి. ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ చేసిన బ్రూక్.. పేసర్ల బౌలింగ్‌లో 258 స్ట్రైక్‌రేట్ కలిగి, స్పిన్నర్ల బౌలింగ్‌లో 117 స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు.
ఐపీఎల్‌లో బ్రూక్ ఆడిన నాలుగు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. పేసర్ల బౌలింగ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ 166 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించగా.. స్పిన్నర్ల బౌలింగ్‌లో 44 బంతులు ఎదుర్కొని 104 స్ట్రైక్‌రేట్ చొప్పున కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బ్రూక్ ఈ సీజన్‌లో ఔటైన 3 సందర్భాల్లో రెండుసార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔట్ కాగా.. ఓసారి పేసర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు.
పేస్ బౌలింగ్‌లో బ్రూక్ సగటు 83 ఉంటే.. స్పిన్ బౌలింగ్‌లో అది కేవలం 23గా ఉంది. ఈ గణాంకాలు చూస్తే స్పిన్నర్ల విషయంలో బ్రూక్ ఎంత బలహీనంగా ఉన్నాడో అన్న విషయం ఇట్టే స్పష్టమవుతుంది. ఇక ముంబైతో మ్యాచ్‌లో బ్రూక్ ఈ బలహీనతను అధిగమిస్తే.. అతని నుంచి మరో భారీ ఇన్నింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment