
హార్దిక్ పాండ్యా- శుబ్‌మన్ గిల్
IPL 202- Shubman Gill- Gujarat Titans: టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గత కొన్నాళ్లుగా సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. వరుస సెంచరీలు బాదిన ఈ యంగ్ డైనమైట్ భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.
వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20లో శతకం, ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో అద్భుత సెంచరీతో అలరించిన గిల్.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీల్లో జట్టులో చోటు దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఇదే జోష్‌లో ఐపీఎల్-2023లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు ఈ పంజాబీ బ్యాటర్.
గతేడాది అదరగొట్టి
గతేడాది గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలవడంలో శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 135కు పైగా స్ట్రైక్‌రేటుతో మొత్తంగా 483 పరుగులు సాధించిన గిల్ ఖాతాలో 4 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటికే టీమిండియా తరఫున పలు రికార్డులు బద్దలు కొట్టిన గిల్.. ఐపీఎల్‌లోనూ మరింత మెరుగ్గా రాణించి ఈ గణాంకాలను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. శుబ్‌మన్ గిల్ తమ భవిష్య నాయకుడు అని విక్రమ్ పేర్కొన్నాడు. సమీపకాలంలో అతడు గుజరాత్ కెప్టెన్‌గా ఎదుగుతాడని.. అందుకు అన్ని విధాలా అర్హత కలిగి ఉన్నాడని చెప్పుకొచ్చాడు.
భవిష్య కెప్టెన్ అతడే
‘‘భవిష్యత్‌లో శుబ్‌మన్ మా జట్టు నాయకుడు కాగలడా? అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెబుతా! అయితే, ఇంతవరకు ఈ విషయంపై పూర్తిస్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జట్టును ముందుండి నడిపించగల నాయకత్వ లక్షణాలు గిల్‌లో మెండుగా ఉన్నాయి.
అతడు పరిణతి గల ఆటగాడు. అద్భుతమైన ప్రతిభాపాటవాలు కలిగి ఉన్నాడు’’ అని విక్రమ్ సోలంకి.. శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘తను చాలా స్మార్ట్. క్రికెటింగ్ నైపుణ్యాలు అమోఘం. అందుకే మా జట్టుకు సంబంధించిన ప్రతి అంశంలోనూ తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం.
ఇప్పుడు కూడా నాయకుడిలాగే
ఇప్పుడు కూడా తను ఓ నాయకుడిలానే జట్లు పట్ల ఎంతో బాధ్యతగా ఉంటాడు. గతేడాది తన ప్రదర్శన చూస్తే మీకే అర్థమవుతుంది’’ అని విక్రమ్ సోలంకి చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్‌తో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
తన కెరీర్‌లో తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్.. ఎవరూ ఊహించని రీతిలో తన జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇక ఐపీఎల్-2023 ఆరంభమ్యాచ్‌లో గుజరాత్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: Asia Cup 2023: పాక్‌లోనే ఆసియా కప్.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!
Rohit Sharma: ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment