ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్‌ను ఢీకొట్టనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఈ సీజన్‌లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది.
ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 17, ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
కేకేఆర్ గత మ్యాచ్‌లో అతి భారీ స్కోర్ (261/6) చేసి కూడా పంజాబ్ చేతిలో భంగపడగా.. ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి కేకేఆర్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది.
ఇరు జట్లు ఇదే సీజన్‌లో తలపడిన సందర్భంలో కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఏప్రిల్3న విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేసర్‌పై అందరి కళ్లు ఉన్నాయి. ఫ్రేసర్ ముంబైతో ఆడిన గత మ్యాచ్‌లో మ్యాడ్ మ్యాన్‌లా రెచ్చిపోయి 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు.
తుది జట్లు (అంచనా)..
కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా (ఇంపాక్ట్ ప్లేయర్)
ఢిల్లీ: జేక్ ఫ్రేసర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, రసిఖ్ సలాం (ఇంపాక్ట్ ప్లేయర్)
Comments
Please login to add a commentAdd a comment