ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సాధించాడు. 17 ఏళ్ల క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 1000 పరుగులు సాధించి, 100 వికెట్లు పడగొట్టి, 100 క్యాచ్‌లు పట్టుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడం ద్వారా జడ్డూ క్యాష్ రిచ్ లీగ్‌లో 100 క్యాచ్‌ల మైలురాయిని తాకాడు.
231 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌లో జడేజా 2776 పరుగులు చేసి 156 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ ఖాతాలో రెండు అర్దసెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో శ్రేయస్ క్యాచ్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ క్యాచ్ కూడా పట్టుకున్న జడేజా.. బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శనలకు గాను జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్‌కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్‌లో ధోని సైతం సీఎస్‌కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్‌కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment