IPL 2024 CSK Vs LSG: Ruturaj Gaikwad As Marcus Stoinis Takes Lucknow Home, Says Tough Pill To Swallow | Sakshi
Sakshi News home page

CSK vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: గైక్వాడ్‌

Published Thu, Apr 25 2024 4:35 PM | Last Updated on Thu, Apr 25 2024 4:35 PM

IPL 2024 CSK vs LSG Tough Pill To Swallow But He: Ruturaj Gaikwad - Sakshi

‘‘ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. అయితే, మ్యాచ్‌ మాత్రం బాగా సాగింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ అద్భుతంగా ఆడింది. 13- 14 ఓవర్ల వరకు మ్యాచ్‌ మా చేతుల్లోనే ఉంది.

అయితే, స్టొయినిస్‌ గొప్ప ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చివేశాడు. పిచ్‌ మీద తేమ ఎక్కువగా ఉంది. అందుకే మా స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లేదంటే ఫలితం వేరేలా ఉండేది.

అయినా.. ఆటలో ఇవన్నీ సహజమే. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు. పవర్‌ ప్లేలోనే రెండో వికెట్‌ కోల్పోయిన వేళ జడ్డూ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది.

పవర్‌ ప్లే తర్వాత వికెట్‌ పడితే శివం దూబేను రంగంలోకి దించాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగానే మా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. 

మేము ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఇంత తేమ కనిపించలేదు. ఏదేమైనా ఎల్‌ఎస్‌జీకి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. వాళ్లు మెరుగ్గా ఆడినందువల్లే పైచేయి సాధించగలిగారు’’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నాడు.

ఓటమికి కారణం అదే
ఇంకాస్త మెరుగైన స్కోరు సాధిస్తే బాగుండేదని.. మార్కస్‌ స్టొయినిస్‌ అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగానే మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌లో తొలుత లక్నో వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓడిన సీఎస్‌కేకు.. సొంత మైదానం చెపాక్‌లోనూ చేదు అనుభవం ఎదురైంది.

తమకు కంచుకోట అయిన చెపాక్‌లో చెన్నై భారీ స్కోరు సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(60 బంతుల్లో 108 నాటౌట్‌)తో దుమ్ములేపగా.. శివం దూబే(27 బంతుల్లో 66) మరోసారి ధనాధన్‌ దంచికొట్టాడు.

వీరిద్దరి సూపర్‌ ఇన్నింగ్స్‌ కారణంగా.. సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆదిలోనే ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(0), కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచి సీఎస్‌కే ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో నికోలస్‌ పూరన్‌ 15 బంతుల్లో 34 పరుగులతో రాణించాడు. 

ఈ క్రమంలో 19.3 ఓవర్లలోనే టార్గెట్‌ పూర్తి చేసిన లక్నో.. చెన్నై కంచుకోటలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఐదో విజయం అందుకుని టాప్‌-4లోకి చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement