#RCB: ఇదేందయ్యా.. ఆ పందొమ్మిది పేర్లు పచ్చబొట్టుగా! | IPL 2024: Die Hard RCB Fan Tribute To WPL 2024 Champs Gets Names Inked, Video Goes Viral - Sakshi
Sakshi News home page

#RCB: మరీ ఇంత పిచ్చి అభిమానమా? నొప్పి భరించి..

Published Sun, Mar 31 2024 9:47 AM | Last Updated on Sun, Mar 31 2024 1:21 PM

IPL 2024 Die Hard RCB Fan Tribute to WPL 2024 champs Gets Names Inked - Sakshi

అభిమానులందు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అభిమానులు వేరు అని మరోసారి నిరూపించాడు ఓ యువకుడు. మాట నిలబెట్టుకుంటూ ఏకంగా పందొమ్మిది పేర్లను చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఇంతకీ ఆ పేర్లు ఎవరివంటే?!..

2008లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. ‘ఈసారి కప్‌ మనకే’ అని ఆశలు పెట్టుకోవడం.. ఆఖరి దాకా ఎదురుచూసి ఉసూరుమనడం.. పదహారేళ్లుగా ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అలవాటైపోయింది. మధ్యలో మూడుసార్లు ఫైనల్‌ వరకు చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడటంతో నెక్ట్స్ టైమ్‌ బెటర్‌ లక్‌ అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు.

విరాట్‌ కోహ్లి వంటి స్టార్‌, రన్‌మెషీన్‌లో జట్టులో ఉన్నా ఆర్సీబీ టైటిల్‌ గండం దాటకపోవడంతో ఒకరకంగా పూర్తి నిరాశలో కూరుకుపోయారు. అలాంటి అభిమానులకు కొత్త ఊపిరిలూదుతూ మహిళా జట్టు తొలిసారి ఆర్సీబీకి ట్రోఫీ అందించింది. వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో ఎడిషన్‌-2024లో చాంపియన్‌గా అవతరించి బెంగళూరు ఫ్రాంఛైజీకి మొదటి టైటిల్‌ అందించింది.

స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ వుమెన్‌ టీమ్‌ ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో ఓ అభిమాని టైటిల్‌ సాధించిన ఆ జట్టులోని ప్లేయర్ల అందరి పేర్లు పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇందులో తాజా ఎడిషన్‌కు దూరమైన హీథర్‌ నైట్‌ పేరు కూడా ఉండటం విశేషం.

ఈ మేరకు.. ‘‘మూడుసార్లు ఐపీఎల్‌ ఫైనల్‌ చేరినా మెన్స్‌ టీమ్‌ టైటిల్‌ సాధించలేకపోయింది. అయితే, పదహారేళ్ల మా కలను ఆర్సీబీ మహిళా జట్టు నెరవేర్చింది. ఒకవేళ WPL 2024 గెలిస్తే వాళ్ల పేర్లను టాటూ వేయించుకుంటానని నేను ప్రామిస్‌ చేశా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నా’’ అంటూ మనోజ్‌ నాయక్‌ అనే ట్విటర్‌ యూజర్‌ అకౌంట్‌లో ఓ వీడియో ప్రత్యక్షమైంది.

ఇందులో ఆర్సీబీ జెర్సీ వేసుకున్న వ్యక్తి.. స్మృతి మంధాన సహా జట్టులోని మొత్తం పందొమ్మిది పేర్లను పచ్చబొట్టు వేయించుకున్నాడు. మరి వాళ్ల పేర్లు ఏమిటంటే..

స్మృతి మంధాన, సోఫీ డివైన్‌, ఎలిస్‌ పెర్రీ, రేణుకా సింగ్‌, రిచా ఘోష్‌, దిశా కసత్‌, శ్రేయాంక పాటిల్‌, ఇంద్రాణి రాయ్‌, ఆశా శోభన, ఏక్తా బిస్త్‌, సబ్బినేని మేఘన, జార్జియా వరేహం, శుభా సతీశ్‌, కేట్‌ క్రాస్‌, నదినె డి క్లర్క్‌, సోఫీ మొలినెక్స్‌, సిమ్రన్‌ బహదూర్‌, శ్రద్ధా పొఖార్కర్‌, హీథర్‌ నైట్‌(తాజా ఎడిషన్‌కు దూరం).

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024లో ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన బెంగళూరు.. తర్వాత పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచింది. కానీ మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఎదుర్కొన్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందం మళ్లీ ఓటమిని చవిచూసింది. తదుపరి మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది.

చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్‌ బౌలర్‌ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్‌’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement