
విరాట్ కోహ్లి (PC: IPL/RCB)
Virat Kohli- RCB- IPL 2024: టీమిండియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంళూరు(ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి గురించి భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024లో ఈ రన్‌మెషీన్ పరుగుల వరద పారించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా విరాట్ కోహ్లి కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడాల్సి ఉండగా సెలవు తీసుకున్నాడు. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో లండన్‌కు వెళ్లిన కోహ్లి.. ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించిన కోహ్లి.. ఐపీఎల్ తాజా ఎడిషన్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ ఆర్సీబీ స్టార్ మైదానంలో దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్(టీ20) టోర్నీలో అఫ్గనిస్తాన్ మీద కోహ్లి కొట్టిన శతకం నాకింకా గుర్తుంది. ఆ తర్వాత అతడు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
అద్భుతమైన ఫామ్‌తో అదరగొట్టాడు. విరాట్ కోహ్లిలో ఉన్న ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే.. తను ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుని తిరిగి వస్తాడో అప్పుడు మరింత ప్రమాదకారిగా మారతాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు.
చాలా మంది ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటానికి రెగ్యులర్‌గా ఆడుతూ ఉంటారు. కానీ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు విరుద్దం. ముందుగా చెప్పినట్లు బ్రేక్ తర్వాత.. తన ఆట తీరు ఇంకా ఇంకా మెరుగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.
అదే విధంగా.. కోహ్లి ఫామ్ మీదనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా ఆధారపడి ఉంటాయని మహ్మద్ కైఫ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మధ్య చెపాక్ వేదికగా ఈ ఈవెంట్‌కు తెరలేవనుంది.
చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్‌లను ఒప్పించి మరీ..
Comments
Please login to add a commentAdd a comment