మా బౌలర్లు అద్భుతం.. ఓటమికి వాళ్లే కారణం: మండిపడ్డ గిల్‌ | IPL 2024 LSG Vs GT: Shubman Gill Blasts GT Batting Unit, Big Admission After Loss To LSG - Sakshi
Sakshi News home page

IPL 2024 LSG Vs GT: మా బౌలర్లు అద్భుతం.. ఓటమికి వాళ్లే కారణం: శుబ్‌మన్‌ గిల్‌ ఫైర్‌

Published Mon, Apr 8 2024 11:29 AM | Last Updated on Mon, Apr 8 2024 11:59 AM

IPL 2024: Gill Blasts GT Batting Unit Big Admission After Loss To LSG - Sakshi

శుబ్‌మన్‌ గిల్‌ (PC: BCCI)

ఐపీఎల్‌-2024ను ఘనంగా ఆరంభించిన గుజరాత్‌ టైటాన్స్‌ అదే జోరును కొనసాగించలేకపోతోంది. వరుస పరాజయాలతో చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటోంది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమిపాలైన టైటాన్స్‌.. మూడో పరాజయాన్ని నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై కూడా తాము పరుగులు రాబట్టలేకపోయామన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైందంటూ విచారం వ్యక్తం చేశాడు.

కాగా లక్నో వేదికగా సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టైటాన్స్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. 

అయితే, లక్ష్య ఛేదనకు దిగిన టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్‌(31), శుబ్‌మన్‌ గిల్‌(19) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌(1) సహా వికెట్‌ కీపర్‌ శరత్‌ బీఆర్‌(2), విజయ్‌ శంకర్‌(17) చేతులెత్తేశారు.

ఏడో నంబర్‌ బ్యాటర్‌ రాహుల్‌ తెవాటియా(30) కాసేపు పోరాడినా... మిగతా వారి నుంచి సహకారం అందకపోవడంతో 130 పరుగులకే గుజరాత్‌ టైటాన్స్‌ ఆలౌట్‌ అయింది. అలా 18.5 ఓవర్లలోనే కథ ముగిసిపోయింది. ఫలితంగా లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్‌ విజయం అందుకుంది.

ఈ నేపథ్యంలో టైటాన్స్‌ సారథి శుబ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ బాగుంది. కానీ మా బ్యాటర్ల ప్రదర్శన అస్సలు బాగాలేదు. మెరుగ్గానే ఆరంభించినా మిడిల్‌ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది.

ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయాం. నిజానికి మా బౌలర్లు అద్భుతంగా ఆడారు. ప్రత్యర్థిని 160 పరుగులకు పరిమితం చేశౠరు. కానీ బ్యాటర్లే ఓటమికి కారణమయ్యారు.

డేవిడ్‌ మిల్లర్‌ను మిస్సయ్యాం. తను ఉండి ఉంటే ఒక్క ఓవర్లోనే మ్యాచ్‌ ను మలుపు తిప్పగలడు. పవర్‌ ప్లేలో ఎక్కువ పరుగులు రాబట్టాలనే ఉద్దేశంతోనే నేను దూకుడుగా ఆడాను. ఆ క్రమంలోనే అవుటయ్యాను’’ అని పేర్కొన్నాడు.

తమ ఓటమికి బ్యాటర్లే ప్రధాన కారణమని గిల్‌ ఈ సందర్బంగా వెల్లడించాడు. కాగా గుజరాత్‌ టైటాన్స్‌ తదుపరి ఏప్రిల్‌ 10న రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. కాగా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచిన గుజరాత్‌.. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

చదవండి: లక్షల కోట్లు ఉంటేనేం!.. 2 పాయింట్లు.. చిన్నపిల్లల్లా అంబానీల సంబరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement