అప్పటికే ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాకు ఆడకపోవడానికి కారణం ఇదే! | 'Have Been Fit Since Afghan Series But...': Hardik Pandya Big Revelation - Sakshi
Sakshi News home page

Hardik Pandya: అప్పటికే ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాకు ఆడకపోవడానికి కారణం ఇదే!

Published Tue, Mar 19 2024 10:41 AM | Last Updated on Tue, Mar 19 2024 12:55 PM

IPL 2024 Have Been Fit Since Afghan Series But: Hardik Pandya Big Revelation - Sakshi

హార్దిక్‌ పాండ్యా (PC: MI)

ఐపీఎల్‌-2024లో బౌలింగ్‌ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. పేస్‌ దళంలో తన వంతు పాత్ర పోషించడానికి సమాయత్తంగా ఉన్నానని తెలిపాడు. కాగా గతేడాది నవంబరులో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌ గాయపడిన విషయం తెలిసిందే.

పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా తన బౌలింగ్‌లో బౌండరీ ఆపే క్రమంలో అదుపుతప్పి పడిపోయాడు పాండ్యా. ఈ క్రమంలో అతడి చీలమండ(కుడికాలి)కు గాయం కాగా.. టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందాడు. క్రమక్రమంగా కోలుకుని ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌కు అందుబాటులోకి వచ్చాడు.

ఇక గత రెండు సీజన్లలో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. ట్రేడింగ్‌లో తిరిగి సొంత గూటికి చేరాడు. ముంబై ఇండియన్స్‌ సారథిగా రోహిత్‌ శర్మ స్థానంలో పగ్గాలు చేపట్టాడు. అయితే, పాండ్యా గాయం గురించి విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 

ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ.. ఐపీఎల్‌కు సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే అతడు టీమిండియా తరఫున పలు ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై తాజాగా స్పందించిన హార్దిక​ పాండ్యా.. తాను జనవరిలోనే ఫిట్‌నెస్‌ సాధించినట్లు వెల్లడించాడు.

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హోదాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌ ఈవెంట్‌ సమయంలో దురదృష్టవశాత్తూ గాయపడ్డాను. పాత గాయాలేమీ తిరగబెట్టలేదు కానీ నొప్పి మాత్రం తీవ్రంగా ఉండేది. 

నా చీలమండ ట్విస్ట్‌ కావడంతో భరించలేని నొప్పి వచ్చేది. త్వరగానే కోలుకుంటాననుకున్నా. కానీ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో వరల్డ్‌కప్‌ మొత్తానికి దూరమయ్యాను. ఇండియాకు ఆడటం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. కానీ అప్పుడలా జరిగిపోయింది.

అయితే, అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ నాటికి నేను ఫిట్‌నెస్‌ సాధించాను. కానీ అప్పటికి నేను ఆడాల్సిన మ్యాచ్‌లు ఏవీ మిగిలిలేవు’’ అని హార్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. ఐపీఎల్‌లో తప్పక బౌలింగ్‌ చేస్తానని ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. 

కాగా మార్చి 22న ఐపీఎల్‌-2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న ముంబై ఇండియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక గాయం కారణంగా హార్దిక్‌ పాండ్యా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా పర్యటన, సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement