IPL 2024: కోట్లు పెట్టినా పేలని పేస్‌ గన్‌.. 20 లక్షలకే పేట్రేగిపోతున్న యువ సంచలనం | IPL 2024: Mitchell Starc Conceded 100 Runs In First Two Matches Played, See Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024: కోట్లు పెట్టినా పేలని పేస్‌ గన్‌.. 20 లక్షలకే పేట్రేగిపోతున్న యువ సంచలనం

Published Sun, Mar 31 2024 3:00 PM

IPL 2024: Mitchell Starc Conceded 100 Runs In First Two Matches Played - Sakshi

ఐపీఎల్‌ 2024 వేలంలో అత్యధిక ధర (24.75 కోట్లతో కేకేఆర్‌ సొంతం చేసుకుంది) పలికి, లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ఆసీస్‌ పేస్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌.. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరుస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సీజన్‌ బరిలోకి దిగిన స్టార్క్‌ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. 

సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 53 పరుగులిచ్చిన స్టార్క్‌.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్‌ చేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులోని కుర్ర బౌలర్లు సత్తా చాటుతుంటే కోట్లు కుమ్మరించి కొనుక్కున స్టార్క్‌ తేలిపోతుండటంతో కేకేఆర్‌ యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. 

స్టార్క్‌తో పాటు కేకేఆర్‌ బౌలింగ్‌ అటాక్‌ను ప్రారంభిస్తున్న 22 ఏళ్ల యువ పేసర్‌ హర్షిత్‌ రాణా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి ఔరా అనిపిస్తే.. స్టార్క్‌ మాత్రం తనపై పెట్టిన డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేక ఉసూరుమనిపిస్తున్నాడు.

స్టార్క్‌పై పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒకటో వంతు (20 లక్షలు) కూడా లభించని రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే.. స్టార్క్‌ మాత్రం కోట్లు జేబులో వేసుకుని దిక్కులు చూస్తున్నాడు.

మరో పక్క తన సహచరుడు, సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేస్తుంటే స్టార్క్‌ మాత్రం కేకేఆర్‌ అభిమానులకు, యాజమాన్యానికి గుండు సున్నా చూపిస్తున్నాడు.

తొలి రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ ఎలాగోలా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకుంటే స్టార్క్‌పై విమర్శల పర్వం మొదలయ్యేది. ఇప్పటికైనా స్టార్క్‌ మొద్దు నిద్రను వీడి రాణించాలని కేకేఆర్‌ అభిమానులు కోరుకుంటున్నారు. 

కాగా, ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్‌.. ఏప్రిల్‌ 3న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

నేటి మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌ తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ను ఎదుర్కోనుండగా.. విశాఖలో జరిగే రాత్రి మ్యాచ్‌లో ఢిల్లీ, సీఎస్‌కే జట్లు తలడనున్నాయి. 


 

Advertisement
Advertisement