పృథ్వీ షా (PC: BCCI/DC)
టీమిండియాలోకి మెరుపులా వచ్చి మాయమైన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ముంబై బ్యాటర్ పృథ్వీ షా కూడా ఆ కోవకు చెందినవాడేనని చెప్పవచ్చంటారు విశ్లేషకులు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి దిగ్గజాలను మెప్పించిన పృథ్వీ.. ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గా పేరొందాడు.
ఈ క్రమంలో 2018లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ(134)తో అలరించాడు. ఆ తర్వాత రెండేళ్లకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ అరంగేట్రం చేశాడు.
కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేక శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌తో పోటీలో వెనుకబడి టీమిండియాకు దూరమయ్యాడు. ఆఖరిగా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఆడిన పృథ్వీ షా.. ఐపీఎల్-2023 సీజన్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2023-24 టోర్నీలో మాత్రం ఫర్వాలేదనిపించాడు. మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన అతడు.. ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో 159 పరుగులతో అదరగొట్టాడు.
ఆ తర్వాత మళ్లీ మూడంకెల స్కోరును అందుకోలేకపోయినా.. ట్రోఫీ గెలిచిన జట్టులో మాత్రం సభ్యుడిగా ఉన్నాడు పృథ్వీ షా. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024కు రెట్టించిన ఉత్సాహంతో సిద్దమయ్యాడు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పృథ్వీ షాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పృథ్వీ షా ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నాడు.
తన ఆట తీరులో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. బ్యాట్ ఝులిపించగలిగితేనే మునుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో పరుగులు రాబట్టడం పృథ్వీ షాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ఎంతో కీలకం. వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా పృథ్వీ రాణిస్తేనే మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతుంది’’ అని ఆస్ట్రేలియా తరఫున రెండుసార్లు వరల్డ్‌కప్ గెలిచిన బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2024తో రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్‌గా పునరాగమనం చేయనున్నాడు. తాజా ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment