IPL 2024 DC VS GT: గొప్ప మనసు చాటుకున్న రిషబ్‌ పంత్‌ | IPL 2024: One Of The Camera Person Hit By Rishabh Pant Six During DC Vs GT Match. Pant Apologizes | Sakshi
Sakshi News home page

IPL 2024 DC VS GT: రిషబ్‌ పంత్‌ గొప్ప మనసు

Published Thu, Apr 25 2024 1:41 PM | Last Updated on Thu, Apr 25 2024 1:41 PM

IPL 2024: One Of The Camera Person Hit By Rishabh Pant Six During DC Vs GT Match. Pant Apologizes

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. తను కొట్టిన సిక్సర్‌ కారణంగా గాయపడిన కెమెరామెన్‌కు క్షమాపణ చెప్పాడు. సదరు వ్యక్తి త్వరగా కోలుకోవాలని క్షమాపణ సందేశాన్ని పంపాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు పంత్‌ గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు. దేవుడు పంత్‌కు టాలెంట్‌తో పాటు గొప్ప మనసు ఇచ్చాడని కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి పంత్‌ నామస్మరణతో నిన్నటి నుంచి సోషల్‌మీడియా మొత్తం దద్దరిల్లుతుంది. 

కాగా, గుజరాత్‌ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 24) జరిగిన మ్యాచ్‌లో పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి, తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న పంత్‌..  5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

పంత్‌ బ్యాట్‌ నుంచి జాలువారిన సిక్సర్లలో ఒకటి బీసీసీఐ ప్రొడక్షన్ క్రూకు సంబంధించిన కెమెరాపర్సన్‌కు తగిలింది. ఇది తెలిసి పంత్‌ మ్యాచ్‌ అనంతరం దేబశిష్‌ అనే సదరు కెమెరామెన్‌కు క్షమాపణ సందేశం పంపాడు.

 

 

దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో పంత్‌ ఇలా అన్నాడు. క్షమించండి దేబశిష్ భాయ్. బంతి పొరపాటున తగలింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వీడియో సందేశాన్ని పంపాడు.

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంత్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3 క్యాచ్‌లు, 3-0-28-1), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు నాటౌట్‌) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ (3-0-15-3) రాణించగా.. మోహిత్‌ శర్మ (4-0-73-0) ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక  పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌ అద్భుతంగా పోరాడింది. సాహా (39), సాయి సుదర్శన్‌ (65), మిల్లర్‌ (55), రషీద్‌ ఖాన్‌ (21 నాటౌట్‌), సాయికిషోర్‌ (13 నాటౌట్‌) గుజరాత్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.

ఆఖర్లో స్టబ్స్‌ అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసంతో తన జట్టుకు ఐదు పరుగులు ఆదా చేసి గుజరాత్‌కు గెలపును దూరం చేశాడు. రషీద్‌ ఖాన్‌ కొట్టిన భారీ షాట్‌ను స్టబ్స్‌ సిక్సర్‌ కాకుండా ఆపాడు. ఫలితంగా ఢిల్లీకి ఐదు పరుగులు సేవ్‌ అయ్యాయి. ఇంచుమించు ఇదే తేడాతో (4 పరుగులు) ఢిల్లీ గుజరాత్‌పై విజయం​ సాధించింది. 

గుజరాత్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ బౌలర్లలో రసిక్‌ సలాం (4-0-44-3), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-29-2), అక్షర్‌ పటేల్‌ (3-0-28-1), నోర్జే (3-0-48-1), ముకేశ్‌ కుమార్‌ (4-0-41-1) వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు రెండు క్యాచ్‌లు పట్టిన పంత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.ఈ గెలుపుతో ఢిల్లీ ఆరో స్థానానికి జంప్‌ కొట్టింది. గుజరాత్‌ ఏడో ప్లేస్‌లో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement