ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో శశాంక్ సింగ్ (25 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), అశుతోష్ శర్మ (15 బంతుల్లో 33 నాఔట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి పంజాబ్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా శశాంక్, అశుతోష్ అభిమానుల మనసుల్ని గెలిచారు. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని పంజాబ్‌ను శశాంక్, అశుతోష్ దాదాపుగా గెలిపించినంత పని చేశారు.
తమ జట్టును గట్టెక్కించడం కోసం ఈ ఇద్దరు చేసిన పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పంజాబ్‌ను గెలిపించేందుకు ఈ ఇద్దరు చేయాల్సిందంతా చేశారు. అయినా పంజాబ్‌కు స్వల్ప తేడాతో ఓటమి తప్పలేదు.
ఉనద్కత్ వేసిన చివరి ఓవర్‌లో పంజాబ్ గెలుపుకు 29 పరుగులు అవసరం కాగా.. శశాంక్, అశుతోష్ 26 పరుగులు పిండుకున్నారు. వీరిద్దరి దెబ్బకు అనుభవజ్ఞుడైన ఉనద్కత్ లయ తప్పి మూడు వైడ్‌లు కూడా వేశాడు. ఆఖరి బంతికి శశాంక్ సిక్సర్ కొట్టినప్పటికీ అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. చివరి బంతికి పంజాబ్‌కు 9 పరుగులు కావల్సి ఉండింది.
ఈ ఓవర్‌లో అశుతోష్ రెండు, శశాంక్ ఓ సిక్సర్ బాది సన్‌రైజర్స్ శిబిరంలో ఆందోళన రేకెత్తించారు. 19వ ఓవర్‌లో ఈ ఇద్దరు అదనంగా ఓ బౌండరీ బాది ఉంటే పంజాబ్ గెలిచుండేది. ఆ ఓవర్‌లో నటరాజన్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి శశాంక్, అశుతోష్‌లను కట్టడి చేశాడు. అంతింగా పంజాబ్ మ్యాచ్ ఓడినా శశాంక్, అశుతోష్ అద్బుతమైన పోరాటపటిమ కనబర్చి అభిమానులకు కావాల్సిన అసలుసిసలు టీ20 మజాను అందించారు.
శశాంక్, అశుతోష్ ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో పోరాటం చేశారు. ఆ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఈ ఇద్దరి పోరాటం కారణంగా పంజాబ్ విజయవంతంగా ఛేదించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌తో మ్యాచ్ తరహాలోనే పంజాబ్‌కు గెలుపుపై ఆశలు లేవు.
SHASHANK SINGH IS A HERO...!!!!
— Johns. (@CricCrazyJohns) April 10, 2024
- He is still in pain after missing the game by a narrow margin 💔 pic.twitter.com/OYf6ZxJl1t
అలాంటి స్థితి నుంచి శశాంక్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ రెండు ప్రదర్శనల కారణంగా శశాంక్, అశుతోష్ రాత్రికిరాత్రి హీరోలైపోయారు. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఓడినా క్రికెట్ అభిమానులు వీరిద్దరికి పోరాటాన్ని కొనియాడుతున్నారు.
ఇదిలా ఉంటే, పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. యువ ఆటగాడు నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్ (4-0-29-4) సన్‌రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో శశాంక్, అశుతోష్ చివరి నిమిషం వరకు పోరాడినా పంజాబ్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment