IPL 2024 RR VS GT: శుభ్‌మన్‌ గిల్‌ ఖాతాలో అరుదైన రికార్డు | IPL 2024 RR VS GT: Shubman Gill Becomes Youngest Cricketer At The Time Of 3000 IPL Runs | Sakshi
Sakshi News home page

IPL 2024 RR VS GT: శుభ్‌మన్‌ గిల్‌ ఖాతాలో అరుదైన రికార్డు

Published Wed, Apr 10 2024 10:51 PM | Last Updated on Wed, Apr 10 2024 10:57 PM

IPL 2024 RR VS GT: Shubman Gill Becomes Youngest Cricketer At The Time Of 3000 IPL Runs - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 10) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద గిల్‌ ఐపీఎల్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

గిల్‌ 24 ఏళ్ల 215 రోజుల వయసులో ఐపీఎల్‌లో 3000 పరుగుల మార్కును తాకగా.. దీనికి ముందు ఈ రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉండేది. విరాట్‌ 26 ఏళ్ల 186 రోజుల వయసులో 3000 పరుగుల మార్కును తాకాడు. ఈ జాబితాలో గిల్‌, విరాట్‌ తర్వాత సంజూ శాంసన్‌, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ ఉన్నారు. సంజూ 26 ఏళ్ల 320 రోజుల వయసులో, రైనా 27 ఏళ్ల 161 రోజుల వయసులో, రోహిత్‌ 27 ఏళ్ల 343 రోజుల వయసులో ఐపీఎల్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకారు. 

ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ (టాప్‌ 5) గిల్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో గిల్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. గిల్‌కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 94 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. క్రిస్‌ గేల్‌ కేవలం 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి ఈ విభాగంలో టాప్‌లో నిలిచాడు. గేల్‌ తర్వాత కేఎల్‌ రాహుల్‌ (80 ఇన్నింగ్స్‌లు), జోస్‌ బట్లర్‌ (85) ఉన్నారు. గిల్‌తో పాటు డేవిడ్‌ వార్నర్‌, డుప్లెసిస్‌ కూడా 94 ఇన్నింగ్స్‌ల్లోనే 3000 పరుగుల మార్కును తాకారు. 

కాగా, గుజరాత్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. రియాన్‌ పరాగ్‌ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (38 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్‌ 8, హెట్‌మైర్‌ 13 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ను కుల్దీప్‌ సేన్‌ (2-0-11-3) ఇరకాటంలో పడేశాడు. సేన్‌ ధాటికి గుజరాత్‌ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. సాయి సుదర్శన్‌ (35), మాథ్యూ వేడ్‌ (4), అభినవ్‌ మనోహర్‌ (1) ఔట్‌ కాగా.. శుభ్‌మన్‌ గిల్‌ (37), విజయ్‌ శంకర్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement