
Pat Cummins And Mahesh Babu- Crazy Viral: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాక సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది. అతడి సారథ్యంలో ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సన్‌రైజర్స్ కాస్తా సన్‘డేంజర్స్’గా మారి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది.
ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్.. ఇలా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పరుగుల సునామీ సృష్టిస్తూ సన్‌రైజర్స్‌ను విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మార్చగా.. వీరి సేవలను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన కమిన్స్ తనదైన వ్యూహాలతో విజయాల పరంపరకు తెరతీశాడు.
ఈ నేపథ్యంలో.. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడ్డ రైజర్స్ ఇప్పుడు.. ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరుసలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు విజయాలతో ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
కాగా సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌తో బెంగళూరుతో తలపడనుంది. హైదారాబాద్ వేదికగా గురువారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో సొంతగడ్డపై మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమైన ప్యాట్ కమిన్స్ బృందం సోమవారం సూపర్‌స్టార్ మహేశ్ బాబును కలిసింది.
ఈ సందర్భంగా మహేశ్ బాబుతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కమిన్స్.. ‘‘ఈరోజు మధ్యాహ్నం.. టాలీవుడ్ ప్రిన్స్‌తో సమయం సంతోషంగా గడిచింది’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక మహేశ్ బాబు సైతం.. ‘‘మిమ్మల్ని నేరుగా కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.
వీరాభిమానిని. మీకు, ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు ఆల్ ది బెస్ట్’’ అంటూ విషెస్ తెలిపాడు. వీరిద్దరి పోస్టులు చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో అంటూ మురిసిపోతున్నారు.
కాగా గతంలో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్‌ను అనుకరిస్తూ అతడు చేసే రీల్స్ నెట్టింట వైరల్ అయిన సందర్భాలు కోకొల్లలు.
చదవండి: ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్ పోస్ట్ వైరల్
SunRisers 🤝 Superstar of Telugu cinema, Mahesh Babu 👑🧡 pic.twitter.com/Nd4MQWCfi8
— SunRisers Hyderabad (@SunRisers) April 22, 2024