IPL 2024: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌.. ప్రకటించిన ఫ్రాంఛైజీ | IPL 2024: Sunrisers Hyderabad Name New Captain In Place Of Markram | Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌.. ప్రకటించిన ఫ్రాంఛైజీ

Published Mon, Mar 4 2024 11:23 AM | Last Updated on Mon, Mar 4 2024 11:53 AM

IPL 2024: Sunrisers Hyderabad Name New Captain In Place Of Markram - Sakshi

ఆరెంజ్‌ ఆర్మీ (PC: SRH)

Big Change In IPL 2024: Sunrisers Hyderabad New Captain: ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. గత సీజన్‌లో సారథిగా వ్యవహరించిన సౌతాఫ్రికా స్టార్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ స్థానాన్ని కమిన్స్‌తో భర్తీ చేసింది.

కాగా 2016లో డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలో తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని గెలిచింది సన్‌రైజర్స్‌. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయింది. ఈ క్రమంలో వార్నర్‌పై వేటు వేయగా.. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.

కేన్‌ మామనూ మార్చేసింది
వార్నర్‌ స్థానంలో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా తీసుకువచ్చినప్పటికీ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. ఫలితంగా కేన్‌ మామకూ బైబై చెప్పింది ఫ్రాంఛైజీ. 

మార్క్రమ్‌కూ ఉద్వాసన
ఐపీఎల్‌-2022 ఎడిషన్‌లో పద్నాలుగింట కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితం కావడంతో ఈ మేరకు కేన్‌ మామపై వేటు వేసింది. అతడి స్థానంలో ఐడెన్‌ మార్క్రమ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

అయినప్పటికీ ఎస్‌ఆర్‌హెచ్‌ రాత మారలేదు సరికదా మరింత పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంది. గతేడాది పద్నాలుంగిట కేవలం నాలుగు మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.

రూ. 20 కోట్లు ఖర్చు చేసి మరీ
ఈ నేపథ్యంలో సరైన సారథి వేటలో పడిన సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌-2024 వేలంలో భాగంగా ప్యాట్‌ కమిన్స్‌ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపిన ఈ పేస్‌ బౌలర్‌ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి.. తాజాగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించింది.

ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మార్చి 23న జరుగనున్న మ్యాచ్‌తో సన్‌రైజర్స్‌ తాజా ఎడిషన్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఆ తర్వాత మార్చి 27న హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో, మార్చి 31న అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో, ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. తొలి దఫా షెడ్యూల్‌లో భాగంగా ఈ మేరకు మ్యాచ్‌లు ఆడనుంది.

చదవండి: IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఇదే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement