నేడు ఐపీఎల్ రెండో క్వాలిఫయర్
రాజస్తాన్‌తో సన్‌రైజర్స్ ఢీ
గెలిచిన జట్టు తుది పోరుకు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
ఓవరాల్‌గా ఆరుసార్లు 200కుపైగా స్కోర్లు... వీటిలో గత ఏడాది వరకు ఉన్న అత్యుత్తమ స్కోరును అధిగమిస్తూ మూడుసార్లు 250కు పైగా పరుగులు... పవర్‌ప్లేలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా రెండుసార్లు 100కు పైగా స్కోర్లు... ముగ్గురు ప్రధాన బ్యాటర్లు కలిపి ఏకంగా 106 సిక్సర్లు... ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన ఇది.
ఈ జోరులో ప్లే ఆఫ్స్‌కు దూసుకొచి్చన జట్టు తొలి క్వాలిఫయర్‌లో కాస్త తడబడింది. అయితే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించగా, రాజస్తాన్ రాయల్స్ రూపంలో ఎదురుగా ప్రత్యర్థి ఉంది. నాణ్యమైన బౌలింగ్‌తో రాజస్తాన్ ఎలాంటి ప్రత్యర్థినైనా నిలువరించగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.
చెన్నై: ఐపీఎల్–17 సీజన్ తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రత్యరి్థని నిర్ణయించే క్వాలిఫయర్–2 సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన హైదరాబాద్, రాజస్తాన్ జట్ల మధ్య చెపాక్ మైదానంలో ఈ పోరు జరగనుంది.
ఈ సీజన్‌లో ఇరు జట్ల తలపడిన ఏకైక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. టోర్నీలో దూకుడైన బ్యాటింగ్‌తో హైదరాబాద్ శాసించగా... రాజస్తాన్ విజయాల్లో బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఇరు జట్లు తాజా సీజన్‌లో చెన్నై వేదికగా ఒక్కో మ్యాచ్ ఆడాయి. హైదరాబాద్ 134, రాజస్తాన్ 141 పరుగులు మాత్రమే చేసి చెన్నై చేతిలో ఓటమి పాలవడం విశేషం.
మార్క్‌రమ్‌ను ఆడిస్తారా!
కోల్‌కతాతో తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. హెడ్ వరుసగా రెండోసారి డకౌట్ కాగా, అభిõÙక్ శర్మ కూడా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపింది. క్లాసెన్ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. ఓపెనర్లు లీగ్ మ్యాచ్ తరహాలో తమ జోరును అందిపుచ్చుకుంటే జట్టు మరోసారి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఇతర బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా సహకరించాల్సి ఉంది.
అయితే బ్యాటింగ్‌ను పటిష్టం చేసేందుకు నాలుగో విదేశీ ఆటగాడిగా మార్క్‌రమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్‌లలో ఒకరిని రైజర్స్ ఆడించవచ్చు. పెద్దగా ప్రభావం చూపలేని విజయకాంత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తీసుకొని ‘ఇంపాక్ట్’ ద్వారా మరో బ్యాటర్‌ను ఆడించే అవకాశం ఉంది. చెపాక్ పిచ్‌పై షహబాజ్‌తో పాటు మరో స్పిన్నర్ జట్టుకు అవసరం. పేస్ బౌలింగ్‌లో భువనేశ్వర్, కమిన్స్‌లతో పాటు సొంత మైదానంలో ఆడుతున్న నటరాజన్ కీలకం అవుతారు.
మార్పుల్లేకుండా...
రాజస్తాన్ మాత్రం బుధవారం ఆర్‌సీబీని ఓడించిన టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. స్పిన్‌కు అనుకూలిస్తే ఒక పేసర్‌ను తప్పించి కేశవ్‌ను ఆడించాలని భావించినా... జట్టు విదేశీ కూర్పుపై ప్రభావం పడవచ్చు. బౌల్ట్ కీలక బౌలర్ కాగా ఓపెనర్‌గా టామ్ కోలర్ ఖాయం. లోయర్ మిడిలార్డర్‌లో హెట్‌మైర్, పావెల్‌ల మెరుపు బ్యాటింగ్‌ను కోల్పోయి పరిస్థితి రాజస్తాన్ తెచ్చుకోదు.
కాబట్టి ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్నర్లు అశి్వన్, చహల్ జట్టు భారం మోస్తారు. ముఖ్యంగా ఓనమాలు నేర్చుకున్న మైదానంలో అశి్వన్ చెలరేగితే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. రాయల్స్ బ్యాటింగ్‌లో కాస్త దూకుడు లోపించింది. ఎలిమినేటర్‌లో కూడా అది కనిపించింది కానీ లక్ష్యం చిన్నది కావడంతో దాని ప్రభావం కనపడలేదు. ముఖ్యంగా సామ్సన్ వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ మాత్రమే నిలకడగా ఆడుతుండగా, జురేల్ కూడా రాణించడం లేదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, త్రిపాఠి, నితీశ్ రెడ్డి, క్లాసెన్, సమద్, షహబాజ్, భువనేశ్వర్, నటరాజన్, మార్కండే, మార్క్‌రమ్. రాజస్తాన్: సామ్సన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, టామ్ కోలర్, పరాగ్, జురేల్, హెట్‌మైర్, పావెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చహల్.
పిచ్, వాతావరణం
చెన్నైలో వేడి చాలా ఎక్కువగా ఉంది. అయితే సాయంత్రం మంచు ప్రభావం కూడా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ సీజన్‌లో జరిగిన 7 మ్యాచ్‌లలో 5 సార్లు తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది.
19: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 19 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్... 9 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలుపొందాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 217, అత్యల్ప స్కోరు 127 కాగా... సన్‌రైజర్స్‌పై రాజస్తాన్ అత్యధిక స్కోరు 220, అత్యల్ప స్కోరు 102.
Comments
Please login to add a commentAdd a comment