IPL 2024: 5 సిక్సర్లు బాదించుకున్న వ్యక్తికి 5 కోట్లు, కొట్టిన వ్యక్తికి 50 లక్షలు | IPL 2024: Yash Dayal To Get 5 Cr, Rinku Gets Only 50 Lakhs | Sakshi
Sakshi News home page

IPL 2024: 5 సిక్సర్లు బాదించుకున్న వ్యక్తికి 5 కోట్లు, కొట్టిన వ్యక్తికి 50 లక్షలు

Published Wed, Dec 20 2023 7:08 PM | Last Updated on Wed, Dec 20 2023 7:16 PM

IPL 2024: Yash Dayal To Get 5 Cr, Rinku Gets Only 50 Lakhs - Sakshi

ఐపీఎల్‌ 2024లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌కు 5 కోట్ల భారీ మొత్తం దక్కనుండగా.. ఆ ఐదు సిక్సర్లు బాదిన బ్యాటర్‌కు మాత్రం కేవలం 50 లక్షలే లభించనున్నాయి. ఈపాటికి విషయం అర్థమయ్యే ఉంటుంది. 

2023 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో కేకేఆర్‌ తురుపుముక్క రింకూ సింగ్‌ ఆఖరి ఓవర్‌లో చివరి ఐదు బంతులకు ఐదు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇది జరిగి ఏడు నెలల కాలం అయిపోయింది. ఈ విషయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు. అయితే నిన్న జరిగిన ఐపీఎల్‌ వేలం తర్వాత ఈ టాపిక్‌ మళ్లీ నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

ఎందుకుంటే.. నిన్న జరిగిన వేలంలో గుజరాత్‌ విడిచపెట్టిన యశ్‌ దయాల్‌ను ఆర్సీబీ 5 కోట్ల ఊహించని ధరకు కొనుగోలు చేసింది. యశ​ దయాల్‌ ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోతాడని అతనితో సహా ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఆర్సీబీ మాత్రం యశ్‌పై భారీ విశ్వాసం ఉంచి, ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ అతన్ని దక్కించుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది.

సిక్సర్లు బాదించుకున్నవ్యక్తికే ఇంత భారీ మొత్తం లభిస్తున్నప్పుడు, ఆ సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్‌కు మాత్రం ఎందుకు అంత తక్కువ మొత్తమని అతని అభిమానులు సోషల్‌మీడియాలో గగ్గోలుపెడుతున్నారు. కేకేఆర్‌.. రింకూని కేవలం 50 లక్షలకే దక్కించుకుని, అతన్ని తిరిగి రీటెయిన్‌ చేసుకుని, అతన్ని ఆర్ధికంగా ఎదగకుండా కట్టిపడేసిందని అతని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 

మనమన్నా, ఐపీఎల్‌ అన్నా గిట్టని ఆస్ట్రేలియన్లకు కోట్ల​కు కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు, అత్యంత ప్రతిభావంతుడైన రింకూ సింగ్‌ విషయంలో ఒక్కసారి పునరాలోచన చేసి అతని ప్రతిభకు తగ్గ మొత్తాన్ని ఫిక్స్‌ చేయాలని సగటు భారత క్రికెట్‌ అభిమాని ఆకాంక్షిస్తున్నాడు. ఇదే సమయంలో కొందరు హర్షల్‌ పటేల్‌ (11.75 కోట్లు), శార్దూల్‌ ఠాకూర్‌ (4 కోట్లు), షారుక్‌ ఖాన్‌ (7.4 కోట్లు), శివమ్‌ మావీ (6.4 కోట్లు) లాంటి ఆటగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ జస్టిస్‌ ఫర్‌ రింకూ అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement