
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ప్రారంభించింది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం సీఎస్‌కే బొక్క బోర్లా పడింది. నిన్న (మార్చి 28) సొంత మైదానం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ సేన ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని (50 పరుగుల తేడాతో) ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన సీఎస్‌కే స్థాయి తగ్గట్టుగా ఆడలేకపోయింది.
తొలుత బౌలింగ్‌లో పట్టులేక ప్రత్యర్ధిని 196 పరుగులు చేయనిచ్చింది. ఆతర్వాత ఛేదనలో కనీస పోరాటం కూడా ప్రదర్శించలేక 146 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌తో పోలిస్తే సీఎస్‌కే బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. రచిన్ రవీంద్ర (41) ఒక్కడే కాస్త పోరాడే ప్రయత్నం చేశాడు.
చివర్లో ధోని (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించినా అప్పటికే సీఎస్‌కే ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఫీల్డింగ్‌లోనూ దారుణంగా విఫలమైంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడంతో పాటు లేని పరుగులు సమర్పించుకుంది.
మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వాస్తవానికి ఈ వికెట్‌పై 170 పరుగులే చాలా ఎక్కువ. అలాంటిది ఆర్సీబీ 196 పరుగులు చేసి, మా బ్యాటింగ్‌ను మరింత సంక్లిష్టం చేసింది. వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ రోజు ఫీల్డింగ్‌లోనూ మేము గొప్పగా లేము. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులను ఛేదిస్తున్నప్పుడు పవర్ ప్లేలో మా బ్యాటింగ్ స్టయిల్ భిన్నంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు.
తొలి ఐదు ఓవర్లు కొత్త బంతి కూడా ఇబ్బంది పెట్టింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. రాహుల్ త్రిపాఠి, నేను చాలా కాన్ఫిడెంట్‌గా షాట్లు ఆడాము. కానీ వర్కౌట్ కాలేదు. మా స్పిన్ త్రయాన్ని ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేశాము. అది కూడా మా ఓటమికి కారణమైంది. తదుపరి మ్యాచ్ కోసం మానసికంగా సిద్దంగా ఉండాలి. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో చెడు రోజు ఉంటుంది. మేము ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి.
రచిన్ సరిగ్గా ముందుకు సాగలేకపోయాడు. హుడా పరిస్థితి కూడా అలాగే ఉండింది. దూబే నుంచి ప్రామిసింగ్ ఇన్నింగ్స్ ఆశించాము. యశ్ దయాల్ డబుల్ స్ట్రయిక్ (ఒకే ఓవర్‌లో 2 వికెట్లు) మా ఓటమిని ఖరారు చేసింది. చివర్లో జడేజా, ధోని భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్‌గా ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది.