
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో పరాజయం ఎదుర్కొన్న ఆ జట్టు.. నిన్న (మార్చి 26) ఆడిన రెండో మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ సీజన్‌లో రాయల్స్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం వారి జట్టు.
గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో వారి జట్టు చాలా బలహీనంగా ఉంది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్‌లో మాత్రం దారుణంగా ఉంది. గత సీజన్ వరకు వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బౌల్ట్‌ను వదులుకుని రాయల్స్ పెద్ద తప్పు చేసింది. వీరి ప్రత్యామ్నాయంగా వచ్చిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.
రాయల్స్ యాష్, చహల్‌కు ప్రత్యామ్నాయంగా లంక స్పిన్ ద్వయం మహీశ్ తీక్షణ, వనిందు హసరంగలను అక్కున చేర్చుకుంది. వీరు మంచి బౌలర్లే అయినా యాష్, చహల్ అంత ప్రభావం చూపలేకపోతున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఈ విషయం తేలిపోయింది. రాయల్స్ మరో ఇన్ ఫామ్ పేసర్ ఆవేశ్ ఖాన్‌ను కూడా వదిలేసి మూల్యం చెల్లించుకుంటుంది.
బౌల్ట్ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న జోఫ్రా ఆర్చర్ గల్లీ బౌలర్ కంటే దారుణంగా తయారయ్యాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ ఏకంగా 76 పరుగులిచ్చాడు (4 ఓవర్లలో). జట్టులోకి కొత్తగా వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యువ పేసర్ ఫజల్ హక్ ఫారూకీ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. అనుభవజ్ఞుడైన సందీప్ శర్మలో మునుపటి జోరు కనిపించడం లేదు. కొత్తగా వచ్చిన దేశీయ పేసర్ తుషార్ దేశపాండే ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు.
మొత్తంగా చూస్తే ఈ సీజన్‌లో అశ్విన్, చహల్, బౌల్ట్ లేని లోటు రాయల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత బౌలింగ్ యూనిట్‌తో రాయల్స్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. బ్యాటింగ్‌నే నమ్ముకొని అద్భుతాలు చేద్దామన్నా, ఈ సీజన్‌లో రాయల్స్ బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. తొలి మ్యాచ్‌లో జురెల్, శాంసన్ పర్వాలేదనిపించినా రెండో మ్యాచ్‌లో వారిద్దరూ తేలిపోయారు.
స్టార్ ఓపెనర్ జైస్వాల్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఏదో చేస్తాడనుకున్న నితీశ్ రాణా దారుణంగా విఫలమవుతున్నాడు. గత సీజన్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన రియాన్ పరాగ్‌లో ఆ మెరుపులు కనిపించడం లేదు. హెట్‌మైర్‌ను పరిశీలించాల్సి ఉంది. ఈ బ్యాటింగ్ విభాగంతో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది.
కాగా, కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్న రాయల్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్ బౌలర్లు కూడా ఏమాత్రం ప్రతిఘటించలేదు.
పార్ట్ టైమ్ బౌలర్ అయిన రియాన్ పరాగ్ ఒక్కడు కాస్త పర్వాలేదనిపించాడు. డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా.. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో సీఎస్‌కేను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గౌహతి వేదికగా మార్చి 30న జరుగనుంది.