
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 31) బిగ్ ఫైట్ జరుగనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ వారి సొంత మైదానం వాంఖడేలో ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టని ముంబై ఇండియన్స్ సొంత అభిమానుల మధ్య ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. ఎంఐ తొలి రెండు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే, గుజరాత్ చేతుల్లో పరాజయంపాలైంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. రెండు మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్..
కేకేఆర్‌పై ముంబైకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ రెండు జట్లు తలపడిన 34 సందర్భాల్లో 23 సార్లు ముంబై విజయం సాధించింది. కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే కేకేఆర్ గెలుపొందింది. అయితే ఇరు జట్లు చివరిగా తలపడిన 6 సందర్భాల్లో మాత్రం కేకేఆర్ 5 సార్లు జయకేతనం ఎగురవేసింది. చివరిగా వాంఖడేలో తలపడిన మ్యాచ్‌లో కూడా కేకేఆర్‌నే విజయం వరించింది. 12 ఏళ్ల తర్వాత కేకేఆర్ ముంబైని వారి సొంత ప్రేక్షకుల మధ్య ఓడించింది.
బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఇరు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇరు జట్లలో భారీ హైప్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా ఫలితం కనిపించడం లేదు. ముంబైతో పోలిస్తే కేకేఆర్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఓ మ్యాచ్ కూడా గెలిచింది.
బ్యాటింగ్‌నే ప్రధాన ఆయుధంగా నమ్ముకున్న ముంబై ఇండియన్స్‌ను ఆ జట్టు బ్యాటర్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. బౌలింగ్‌లో హార్దిక్ గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా బ్యాటర్‌గా తేలిపోయాడు. నమన్ ధీర్ గత సీజన్‌లో వచ్చిన హైప్‌ను రీచ్ కాలేదు. యువ ఆటగాడు రాబిన్ మింజ్‌కు అవకాశాలిస్తే రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయాడు.
బ్యాటర్‌గా దీపక్ చాహర్ తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. బ్యాటర్‌గా సత్తా చాటేందుకు మిచెల్ సాంట్నర్‌కు సరైన అవకాశం లభించలేదు. బౌలింగ్ విషయానికొస్తే.. బౌల్ట్, సాంట్నర్ స్థాయికి తగ్గట్టు రాణించలేదు. దీపక్ చాహర్ పర్వాలేదనిస్తున్నాడు. ఆంధ్ర కుర్రాడు సత్యనారాయణ రాజు తేలిపోయాడు. తొలి మ్యాచ్‌లో విజ్ఞేశ్ పుతుర్ అద్భుతంగా బౌలింగ్ చేసినా రెండో మ్యాచ్‌లో అతన్ని ఆడించలేదు.
కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు కూడా బ్యాటింగే ప్రధాన బలం. బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో వరుణ్ చక్రవర్తి కాస్త అనుభవజ్ఞుడిలా కనిపిస్తాడు. తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో సత్తా చాటిన సునీల్ నరైన్ అస్వస్థత కారణంగా రెండో మ్యాచ్ ఆడలేదు. తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన రహానే రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ సెంచరీకి చేరువై ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు.
డికాక్ ఫామ్‌లోకి రావడం కేకేఆర్‌కు శుభసూచకం. రాయల్స్‌తో మ్యాచ్‌లో నరైన్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన మొయిన్ అలీ బంతితో సత్తా చాటాడు. వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్‌లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయలేకపోతున్నారు. రసెల్, రమన్‌దీప్‌కు సరైన అవకాశాలు రావాల్సి ఉంది. బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా పర్వాలేదనిపించారు.
నేటి మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు రాణిస్తే ఆ జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించడం అంత ఈజీ కాదు. రోహిత్, సూర్యకుమార్ చెలరేగితే ముంబైకి పట్టపగ్గాలు ఉండవు.
తుది జట్లు (అంచనా)..
ముంబై: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజు
కేకేఆర్: క్వింటన్ డి కాక్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ,అంగ్క్రిష్ రఘువంశీ