Riyan Parag: మ్యాచ్‌ గెలిచినా సుఖం లేదు..! | IPL 2025: RR Captain Riyan Parag Fined 12 Lakh For Code Of Conduct Breach During Match VS CSK | Sakshi
Sakshi News home page

Riyan Parag: మ్యాచ్‌ గెలిచినా సుఖం లేదు..!

Published Mon, Mar 31 2025 11:46 AM | Last Updated on Mon, Mar 31 2025 1:15 PM

IPL 2025: RR Captain Riyan Parag Fined 12 Lakh For Code Of Conduct Breach During Match VS CSK

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా సీఎస్‌కేతో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో రెండు పరాజయాల తర్వాత (సన్‌రైజర్స్‌, కేకేఆర్‌) రాయల్స్‌ సాధించిన తొలి విజయం ఇది. సారధిగా రియాన్‌ పరాగ్‌కు కూడా ఇదే తొలి గెలుపు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ గెలిచిన ఆనందం రియాన్‌కు ఎంతో సేపు నిలబడలేదు. జట్టు స్లో ఓవర్‌రేట్‌కు బాధ్యుడిని చేస్తూ రియాన్‌కు 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో రాయల్స్‌కు ఇది తొలి స్లో ఓవర్‌రేట్‌ తప్పిదం. 

స్లో ఓవర్‌ రేట్‌ (నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోవడం​) అనేది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ని ఉల్లంఘన కిందికి వస్తుంది. గత సీజన్‌ వరకు ఓ సీజన్‌లో ఓ జట్టు మూడు సార్లు స్లో ఓవర్‌రేట్‌ తప్పిదం చేస్తే కెప్టెన్‌పై ఓ మ్యాచ్‌ నిషేధం (భారీ జరిమానాతో పాటు) విధించేవారు. అయితే ఈ రూల్‌ను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ సీజన్‌లో రద్దు చేసింది. కెప్టెన్లపై నిషేధాస్త్రాన్ని ఎత్తి వేసి కేవలం​ జరిమానాతో సరిపెట్టింది. 

గత సీజన్‌లో మూడు సార్లు స్లో ఓవర్‌రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గానూ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఈ సీజన్‌లో ఓ మ్యాచ్‌ నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో కూడా హార్దిక్‌ తన తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ తప్పిదానికి బాధ్యుడయ్యాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్లో ఓవర్‌రేట్‌ మెయింటైన్‌ చేయడంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు 12 లక్షల జరిమానా విధించారు.

కాగా, సీఎస్‌కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ చివరి ఓవర్‌లో విజయాన్ని ఖరారు చేసుకుంది. 183 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్‌ బౌలర్లు చివరి వరకు పోరాడారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నితీశ్‌ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్‌ ఇంకా భారీ స్కోర్‌ చేయాల్సింది. 

అయితే నితీశ్‌ను ఔట్‌ చేశాక సీఎస్‌కే బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేసి పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. అనంతరం సీఎస్‌కే ఛేదనలో తడబడినా చివరి ఓవర్‌ వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. 13 పరుగులకే పరిమితమై సీజన్‌లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. 

రాయల్స్‌ బౌలర్లలో హసరంగ (4-0-35-4), జోఫ్రా ఆర్చర్‌ (3-1-13-1) సీఎస్‌కేను దెబ్బకొట్టారు. కెప్టెన్‌గా తొలి విజయం సాధించిన రియాన్‌ ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగానూ రాణించాడు. బ్యాటింగ్‌లో కీలకమైన ఇన్నింగ్స్‌ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి ఓ అద్భుతమైన క్యాచ్‌ (శివమ్‌ దూబే) అందుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement