Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే వస్తోంది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైన సీఎస్‌కే హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. అంతేకాదు పరమ చెత్త ఆటతీరుతో (-2.157) దారుణమైన నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
ఆర్సీబీతో మ్యాచ్ ఓటమిపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి తానే మొత్తం బాధ్యత తీసుకుంటానని రుతురాజ్ పేర్కొన్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమయ్యానని, అందుకే ఓటమికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.
రుతురాజ్ మాట్లాడుతూ.. ‘బిగ్ టార్గెట్ మన కళ్లముందు ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాల్సిన అవసరముంది. టాపార్డర్‌లో నేను ఎక్కువ పరుగులు చేయాల్సింది. మా బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్‌తో పాటు శివమ్ దూబే తమ పోరాటం చేశారు. కానీ నేను బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే ఓటమిని నన్ను నేను బాధ్యుడిగా చేసుకుంటున్నా.
అన్షుల్ కాంబోజ్ దాదాపుగా అతడి వికెట్ తీశాడు. మేం ఆనందంలో ఉన్నాం. అయితే.. ఆ బాల్ నోబాల్ కావడం మా దురదృష్టకరం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానం నలువైపులా బంతిని బాదాడు. అతడు బ్యాటింగ్ చేసిన విధానానికి ఖచ్చితంగా హ్యాట్సాఫ్.
గతంలో భారీ స్కోర్లను ఛేదించిన సందర్భాలున్నాయి. హ్యాట్రిక్ ఓటములు బాధ కలిగిస్తున్నప్పటికీ తర్వాతి మ్యాచ్‌ల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటాం’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 3 బంతుల్లో ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గత సీజన్‌లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రుతురాజ్ అప్పటి నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతూనే వస్తున్నాడు.
కెప్టెన్సీ అనే బాధ్యత రుతురాజ్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: భువనేశ్వర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి


