చెలరేగిన రాహుల్‌.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ | IPL 2026, Match 43: Delhi Capitals Beat Rajasthan Royals | Sakshi
Sakshi News home page

చెలరేగిన రాహుల్‌.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ

May 1 2026 11:30 PM | Updated on May 2 2026 10:01 AM

IPL 2026, Match 43: Delhi Capitals Beat Rajasthan Royals

264 పరుగులు చేసినా ఓడిపోయె... ఆపై 75 పరుగులకు కుప్పకూలె...  అటు బ్యాటర్లు, ఇటు బౌలర్ల పేలవ ప్రదర్శన... టీమ్‌లో గందరగోళ స్థితిలో వరుసగా మూడు ఓటములు... ఇలాంటి స్థితిలో స్థైర్యం కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎట్టకేలకు ఒక విజయంతో ఊరట లభించింది. 

సమష్టి ప్రదర్శనతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించడంలో సఫలమైంది. మరోవైపు గత మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 223 పరుగుల లక్ష్యాన్ని అందుకొని సత్తా చాటిన రాజస్తాన్‌ ఈసారి 225 పరుగుల స్కోరును నిలబెట్టుకోలేకపోయింది.    

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలక విజయం దక్కింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ (50 బంతుల్లో 90; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ అవకాశం కోల్పోగా... ధ్రువ్‌ జురేల్‌ (30 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. 

వీరిద్దరు మూడో వికెట్‌కు 59 బంతుల్లో 102 పరుగులు జోడించారు. చివర్లో డొనొవాన్‌ ఫెరీరా (14 బంతుల్లో 47 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు సాధించింది. అనంతరం ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 226 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కేఎల్‌ రాహుల్‌ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పతుమ్‌ నిసాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 110 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.  

ఫెరీరా దూకుడు... 
ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ స్టార్క్‌ ఈ సీజన్‌లో తొలిసారి ఐపీఎల్‌లో బరిలోకి దిగాడు. అతడు వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే యశస్వి జైస్వాల్‌ (6) సిక్స్‌ కొట్టినా... మూడో బంతికే వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో జేమీసన్‌ పదునైన యార్కర్‌తో వైభవ్‌ సూర్యవంశీ (4) ఆట ముగించాడు. ఈ దశలో జురేల్, పరాగ్‌ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జేమీసన్‌ ఓవర్లో పరాగ్‌ వరుసగా 6, 4, 6 కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. 

అక్షర్‌ ఓవర్లోనూ రెండు వరుస సిక్స్‌లు బాదిన అతను 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. జురేల్‌ను అక్షర్‌ వెనక్కి పంపగా, రవీంద్ర జడేజా (20) ప్రభావం చూపలేదు. జేమీసన్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన పరాగ్‌ 90కి చేరుకున్నాడు. అయితే తర్వాతి ఓవర్‌ వేసిన స్టార్క్‌... జడేజా, పరాగ్‌లను వెనక్కి పంపించాడు. 17 ఓవర్లలో జట్టు స్కోరు 173/5. అయితే చివరి 3 ఓవర్లలో ఫెరీరా చెలరేగిపోవడంతో రాజస్తాన్‌ 52 పరుగులు రాబట్టింది. కుల్దీప్‌ ఓవర్లో 3 సిక్సర్లు బాదిన అతను, స్టార్క్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టాడు. నటరాజన్‌ వేసిన ఆఖరి ఓవర్లోనూ 2 సిక్స్‌లు, ఫోర్‌తో సత్తా చాటాడు.  

మెరుపు ఆరంభం... 
ఛేదనలో ఢిల్లీకి నిసాంక, రాహుల్‌ సరైన ఆరంభాన్ని అందించారు. ఆర్చర్‌ తొలి 2 ఓవర్లలో వీరిద్దరు కలిసి 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 పరుగులు రాబట్టారు. బర్గర్‌ తొలి ఓవర్లో రాహుల్‌ 2 ఫోర్లు కొట్టగా, తర్వాతి ఓవర్లో నిసాంక 2 సిక్స్‌లు బాదాడు. పవర్‌ప్లేలో జట్టు 70 పరుగులు చేయగా, 23 బంతుల్లో నిసాంక అర్ధసెంచరీ సాధించాడు. ఆ తర్వాత బిష్ణోయ్‌ ఓవర్లోనూ రాహుల్‌ ఫోర్, 2 సిక్స్‌లతో చెలరేగాడు.

 శతక భాగస్వామ్యం తర్వాత నిసాంకను అవుట్‌ చేసి జడేజా ఈ జోడీని విడదీయగా, 27 బంతుల్లో రాహుల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు నితీశ్‌ రాణా (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించాడు. రాహుల్, రాణా ఆరు పరుగుల వ్యవధిలో అవుట్‌ కావడంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. అయితే అశుతోష్‌ శర్మ (15 బంతుల్లో 25 నాటౌట్‌; 4 ఫోర్లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (11 బంతుల్లో 18 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) నాలుగో వికెట్‌కు 24 బంతుల్లో అభేద్యంగా 49 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు.   

Advertisement
 
Advertisement
Advertisement