ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి | IPL 2026: Mukul Choudhary takes Lucknow to last-ball win | Sakshi
Sakshi News home page

IPL 2026: ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి

Apr 9 2026 11:56 PM | Updated on Apr 10 2026 9:52 AM

IPL 2026: Mukul Choudhary takes Lucknow to last-ball win

ఐపీఎల్‌-2026లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.

ఈ విజయంలో ముకుల్ చౌదరిది కీలక పాత్ర. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్‌ప్లేలోనే ఓపెనర్లు మార్‌క్రమ్‌(22), మార్ష్‌(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే రిషబ్ పంత్‌(10), నికోలస్ పూరన్‌(13), సమద్(2) కూడా వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆయూశ్ బదోని మాత్రం కేకేఆర్ బౌలర్లను టార్గెట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన అనంతరం బదోని(54) కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు.

ముకుల్‌ సంచలనం
కానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు. తొలి ఆరు బంతుల్లో కేవలం 6 పరుగులు చేసిన ముకుల్‌.. ఆ తర్వాత మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా.. ముకుల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 

కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 6, 4, 6 బాది 16 పరుగులు రాబట్టేశాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారింది. తొలి బంతికి అవేష్‌ ఖాన్‌ సింగిల్‌ తీసి స్ట్రైక్‌ ముకుల్‌ చౌదరికి ఇచ్చాడు. రెండో బంతికి సిక్సర్ బాదిన ముకుల్ చౌదరి, ఆ తర్వాత 2 డాట్ బాల్స్ ఆడాడు. 

చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి వచ్చింది. దీంతో ఇరు జట్ల డగౌట్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతిని ముకుల్‌ సిక్సర్‌గా బాది స్కోర్లను సమం చేశాడు. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్‌ కీపర్‌ రఘువంశీ డైరెక్ట్‌ త్రో చేయడంలో విఫలమయ్యాడు.

ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా, అనుకుల్ రాయ్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. సునీల్ న‌రైన్‌, గ్రీన్‌, త్యాగీ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంతకముందు బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్‌ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్‌(32), రావ్‌మన్‌ పావెల్‌(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌, సిద్దార్ధ్‌, దిగ్వేష్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IPL 2026: 'అతడొక సంచలనం.. టీమిండియా సూపర్‌ స్టార్‌ అవుతాడు'
 

Advertisement
 
Advertisement
Advertisement