Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరుకు రాజస్తాన్ రాయల్స్ అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ స్పందించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఆరంభంలో మంచి స్టార్ట్ లభించినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ అద్భుతంగా ఆడి మా నుంచి విజయాన్ని లాగేసుకున్నారని పటిదార్ తెలిపాడు.
‘పవర్‌ప్లేను మేము ప్రారంభించిన తీరు, వికెట్లు పడినప్పటికీ ఆ తర్వాత 202 పరుగులు చేయడం అన్నీ సానుకూలంగానే జరిగాయి. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే జైస్వాల్ ఔటవ్వడంతో పట్టు చిక్కిందని భావించాం. కానీ వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అతడు సృష్టించిన విధ్వంసం మాకు విజయాన్ని దూరం చేసిందని చెప్పొచ్చు.
వైభవ్, జురేల్‌లు అడ్డుగోడల్లా నిలబడితే మాకు విజయం ఎలా వస్తుంది చెప్పండి. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్‌గా ఉపయో గించడం కొంత స్ట్రాటజీ ఉంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆ స్ట్రాటజీ బాగా పని చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో అది దెబ్బకొట్టింది. వెంకటేశ్, షెపర్డ్, కృనాల్ పాండ్యా రూపంలో ముగ్గురు బౌలర్లు ఉండడంతో సుయాశ్ అవసరం ఉండదని భావించాం.
ఐపీఎల్ లాంటి పోటీతరమైన క్రికెట్‌లో తప్పులు జరగడం సహజం. కానీ రాబోయే మ్యాచ్‌ల్లో ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని మళ్లీ ట్రాక్ ఎక్కుతాం’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు.
అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.


