IPL: Ex BCCI GM Reveals How Akshay Kumar Multi Crore Sacrifice Saved Delhi Capitals - Sakshi
Sakshi News home page

IPL: ‘ఢిల్లీ క్యాపిటల్స్‌’ కోసం సూపర్‌స్టార్‌ కోట్లు వదులుకున్నాడు: బీసీసీఐ మాజీ జీఎం

Published Wed, Aug 16 2023 12:32 PM | Last Updated on Wed, Aug 16 2023 1:16 PM

IPL: Ex BCCI GM Reveals How Akshay Kumar Multi Crore Sacrifice Saved Delhi Capitals - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే కాసుల వర్షం. క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరొందిన ఈ మెగా క్రికెట్‌ ఈవెంట్‌లో భాగమైన ఫ్రాంఛైజీలలో అత్యధికం బడా సంస్థలకు చెందినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఐపీఎల్‌లో సక్సెస్‌ అయితే ఎంతటి క్రేజ్‌ వస్తుందో.. ఏమాత్రం తేడా జరిగినా అదే స్థాయిలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది!

ఐపీఎల్‌ రెండో సీజన్‌(2009)లో విజేతగా నిలిచిన దక్కన్‌ చార్జర్స్‌ ఆ తర్వాత కనుమరుగైన తీరే ఇందుకు నిదర్శనం. అయితే, అదే ఏడాది.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తాము కూడా చార్జర్స్‌ మాదిరే చేతులు కాల్చుకోకుండా తీసుకున్న కీలక నిర్ణయం గురించి, దానితో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌కు ఉన్న సంబంధం గురించి బీసీసీఐ మాజీ జీఎం అమృత్‌ మాథూర్‌ సంచలన విషయాలు తాజాగా వెల్లడించాడు.

బాలీవుడ్‌తో అనుబంధం
ఐపీఎల్‌కు ప్రాచుర్యం కల్పించే క్రమంలో బాలీవుడ్‌ను కూడా ఇందులో మమేకం చేసిన విషయం తెలిసిందే. బీ-టౌన్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, అలనాటి హీరోయిన్‌ జూహీ చావ్లా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు యజమానులు కాగా.. శిల్పా శెట్టి కుంద్రా రాజస్తాన్‌ రాయల్స్‌కు, ప్రీతి జింటా పంజాబ్‌ కింగ్స్‌కు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే.

ఫ్రాంఛైజీ ఓనర్లుగానే గాకుండా ప్రమోషన్లలో భాగమైన, భాగమవుతున్న స్టార్లు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో 2009లో ఢిల్లీ క్యాపిటల్స్‌(ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌) సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అక్కీతో అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోగా ఆర్థికపరంగా నష్టాలూ చవిచూసింది.

అనవసర ఖర్చులు ఎందుకు?
అనవసర ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అతడితో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు చట్టపరంగా చిక్కులు ఎదరవుతాయని భావించినా.. అక్షయ్‌ కుమార్‌ పెద్ద మనసుతో ఈ సమస్య నుంచి ఫ్రాంఛైజీ తేలికగా బయటపడేలా చేశాడు. ‘‘ప్రమోషనల్‌ ఫిల్మ్స్‌, మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఈవెంట్ల కోసం అక్షయ్‌ కుమార్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.

కోట్లా మైదానంలో విన్యాసాలు మినహా క్యాపిటల్స్‌కు అతడి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. నిజానికి అతడి సేవలు వినియోగించడంలో యాజమాన్యం విఫలమైంది. నష్టాలు వెంటాడాయి. దీంతో అర్ధంతరంగా అక్కీతో డీల్‌ ముగించాలని భావించింది.

న్యాయపరంగా చిక్కులు.. అయితే
న్యాయపరంగా అందుకు అనేక అడ్డంకులు ఉండటంతో అక్షయ్‌ కుమార్‌ దయపైనే అంతా ఆధారపడి ఉన్న సందర్భం. అక్కీ లాయర్లతో విషయం గురించి చెప్పాం. ఆ తర్వాత ఓరోజు సినిమా షూటింగ్‌లో ఉన్నపుడు.. షాట్‌ ముగిసిన తర్వాత అక్షయ్‌ వానిటీ వ్యాన్‌లోకి నేను వెళ్లాను.

మరేం పర్లేదన్న అక్షయ్‌ కుమార్‌
సంశయిస్తూనే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి.. డీల్‌ రద్దు చేసుకోవాలనుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి వివరించాను. కానీ అక్షయ్‌ మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు. మరేం ప్రాబ్లం లేదండి! ఒకవేళ ఇదంతా వర్కౌట్‌ కాదనుకుంటే.. వెంటనే రద్దు చేసేయండి. పర్లేదు అన్నాడు.

నేను విన్నది నిజమేనా
నేను విన్నది నిజమేనా అన్న సందేహంలో కొట్టుమిట్టాతుండగా.. ‘‘మీరేం ఇబ్బంది పడకండి. ఎలాంటి సమస్య రాకుండా దీనిని ఎలా ముగించాలో మా లాయర్లతో నేను మాట్లాడతా అని మళ్లీ అక్షయ్‌ క్లారిటీ ఇచ్చాడు’’ అని అమృత్‌ మాథుర్‌ పేర్కొన్నాడు.

ఈ మేరకు తన ఆత్మకథలో నాటి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలవలేదన్న విషయం తెలిసిందే. తాజా సీజన్‌లోనూ దారుణ ప్రదర్శనతో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక అక్షయ్‌ కుమార్‌ విషయానికొస్తే.. అతడు నటించిన ఓ మై గాడ్‌ 2 సినియా ఇటీవలే విడుదలైంది.   

చదవండి: APL 2023: తొలిరోజు మ్యాచ్‌కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్‌లో ఆ అదృష్టం మీదైతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement