విశ్వవ్యాప్త క్రికెట్ అభిమానాన్ని యేటికేడు పెంచుకుంటున్న ఐపీఎల్‌లో ఆటకు ముందు వేలం పాట జరగబోతోంది. దుబాయ్‌లో నేడు నిర్వహించే మినీ వేలానికి 333 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది 77 మంది కాగా... ఇటీవల ప్రపంచకప్‌తో పాటు పరిమిత ఓవర్ల ఆటలో మెరిపిస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలన్నీ సై అంటున్నాయి.
దుబాయ్: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు నేడు దుబాయ్‌లో ఆటగాళ్ల మినీ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ విదేశీ గడ్డపై జరగనుంది. ఒక రోజు ముందు సోమవారం ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాక్ వేలం కూడా నిర్వహించారు. ఇక కోట్ల పందేరం, ఆటగాళ్లకు అందలం పలికేందుకు ఒకటోసారి, రెండోసారి అని సుత్తి బద్దలు కొట్టే ప్రక్రియే తరువాయి.
1,166 మంది నమోదు చేసుకుంటే...
ఈ మినీ వేలం కోసం ఐసీసీ సభ్య, అనుబంధ దేశాలు, దేశవాళ్లీ ఆటగాళ్లు ఆసక్తి చూపారు. ఏకంగా 1,166 మంది ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకుంటే... ఫ్రాంచైజీ జట్లతో సంప్రదింపుల అనంతరం లీగ్ పాలకమండలి 333 మంది ఆటగాళ్లతో తుది జాబితాను సిద్ధం చేసింది.
ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది మాత్రం 77 మంది ఆటగాళ్లు. ఇందులో 30 ఖాళీలను విదేశీ ఆటగాళ్లతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంది. అత్యధికంగా 12 ఖాళీలు కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఉన్నాయి. నలుగురు విదేశీ ఆటగాళ్లు సహా 12 మందిని కొనేందుకు కోల్‌కతా వద్ద రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి.
హాట్ కేక్... రచిన్?
భారత్‌లో ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో డాషింగ్ బ్యాటర్‌గా రచిన్ రవీంద్ర అందరికంటా పడ్డాడు. ఆరంభంలో ఎదురుదాడికి దిగి న్యూజిలాండ్ విజయాలకు గట్టి పునాది వేసిన రచిన్ ఈ మినీ వేలంలో హాట్‌కేక్ కానున్నాడు. రూ.50 లక్షల కనీస ధరతో ఫ్రాంచైజీల్ని ఆకర్షిస్తున్నాడు. ఆసీస్ స్పీడ్‌స్టర్స్ స్టార్క్, కమిన్స్, బ్యాటర్ ట్రావి హెడ్, దక్షిణాఫ్రికా సంచలనం కొయెట్జీ, హసరంగ (శ్రీలంక) తదితర స్టార్ క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎగబడే అవకాశాలు న్నాయి.
భారత్ నుంచి శార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ల సెట్ నుంచి షారుఖ్ ఖాన్‌లపై రూ.కోట్లు కురిసే అవకాశముంది. వేలం కోసం ప్లేయర్ల ప్రత్యేకతను బట్టి 19 సెట్‌లుగా విభజించారు. అంటే బ్యాటర్, ఆల్‌రౌండర్, పేసర్, స్పిన్నర్, వికెట్ కీపర్, క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ఇలా సెట్‌ల వారీగా వేలం ప్రక్రియ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment