‘ఇది నీ విజయం.. నీకు మాత్రమే సొంతం అర్జున్‌’ | IPL Players 2021: Actor Farhan Akhtar Supports MI Team Arjun Tendulkar | Sakshi
Sakshi News home page

‘ఇది నీ విజయం.. నీకు మాత్రమే సొంతం అర్జున్‌’

Published Sat, Feb 20 2021 4:04 PM | Last Updated on Sat, Feb 20 2021 4:54 PM

IPL Players 2021: Actor Farhan Akhtar Supports MI Team Arjun Tendulkar - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌కు బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ అండగా నిలిచాడు. ఆట పట్ల అర్జున్‌కు అమిత శ్రద్ధ ఉందని, అతడి ఉత్సుకతను హత్య చేయవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నెపోటిజం పేరిట తనను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికాడు. కాగా సచిన్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్న అంబానీ గ్రూపు ఆధ్వర్యంలోని ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బంధుప్రీతి కారణంగానే అర్జున్‌కు ఈ అవకాశం వచ్చిందంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. 

అంతేగాక, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్‌ స్పందించిన విధానానికి, అర్జున్‌ ఐపీఎల్‌ అరంగేట్రాన్ని ముడిపెడుతూ విమర్శిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఫర్హాన్‌ అక్తర్‌.. ‘‘అర్జున్‌ టెండుల్కర్‌ గురించి ఒక విషయం చెప్పదలచుకున్నాను. మేమిద్దరం ఒకే జిమ్‌లో తరచుగా కలుస్తూ ఉంటాం. ఫిట్‌నెస్‌ సాధించేందుకు అతడు ఎంతో కఠినంగా శ్రమిస్తాడు. మంచి క్రికెటర్‌గా ఎదిగే అంశాలపై దృష్టి పెడతాడు. కానీ వాటన్నింటినీ నెపోటిజం అనే ఒకే ఒక్క మాటతో నీరుగార్చడం సరికాదు. అంతకంటే క్రూరమైంది మరొకటి లేదు. అతడి ఉత్సాహాన్ని మర్డర్‌​ చేయకండి. సరికొత్త ప్రయాణానికి ముందే తనపై విమర్శల భారం మోపకండి’’ అని ట్విటర్‌ వేదికగా అర్జున్‌కు మద్దతు ప్రకటించాడు. 

ఇక  సచిన్‌ కుమార్తె, అర్జున్‌ అక్క సారా టెండుల్కర్‌ సైతం.. ‘‘ఈ విజయాన్ని నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఇది నీ విజయం’’ అంటూ తమ్ముడికి అండగా నిలిచారు. కాగా ప్రతిభ ఆధారంగానే అర్జున్‌ను తాము ఎంపిక చేసుకున్నట్లు ముంబై ఇండియన్స్‌ హెచ్‌కోచ్‌ మహేల జయవర్దనే తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఓ మ్యాచ్‌లో అర్జున్‌ టెండుల్కర్‌ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టడం సహా, మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌ ప్రతిభ కనబరిచాడు.

చదవండి: అర్జున్‌ బ్యాటింగ్‌ మెరుపులు..సిక్సర్ల మోత

లక్కీగా అర్జున్‌ బౌలర్‌ అయ్యాడు.. లేదంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement