చేతులారా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. భారత జట్టు ఓపెనర్‌గా తనదైన శైలిలో రాణిస్తూ ప్రతిభ నిరూపించుకున్న ఈ జార్ఖండ్ వికెట్ కీపర్.. కొంత కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.
గతేడాది నవంబరులో సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే వ్యక్తిగత కారణాలు చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ పట్ల బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని జట్టు నుంచి నిష్క్రమించిన ఈ యంగ్ ఓపెనర్.. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో.. తుదిజట్టులో ఆడే అవకాశం రానందు వల్లే ఇషాన్ ఇంటిబాట పట్టాడని.. ఈ క్రమంలో బోర్డుతో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. ఇషాన్ దేశవాళీ క్రికెట్(రంజీ)లో ఆడితేనే మళ్లీ జాతీయ జట్టులో అడుగుపెట్టగలడని స్పష్టం చేశాడు.
అయితే, ఇషాన్ కిషన్ మాత్రం ఈ ఆదేశాలను బేఖాతరు చేశాడు. జార్ఖండ్ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడని స్థానిక బోర్డు ఆశించినా.. అతడి నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ.. ఇషాన్ కిషన్‌ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది.
ఈ విషయంపై తాజాగా ఇషాన్ కిషన్ స్పందించాడు. తాను రంజీలు ఆడకపోవడానికి గల కారణం వెల్లడించాడు. ‘‘ఒక ఆటగాడు చాలా కాలం తర్వాత పునరాగమనం చేయాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన ఉంది.
అయితే, నన్ను కూడా ఇలా ఆడమనడంలో అర్థం లేదనిపించించింది. ఎందుకంటే నేను కాస్త విరామం తీసుకున్నా. అది సాధారణ సెలవు మాత్రమే.
అలాంటపుడు నేనెందుకు రంజీలు ఆడాలి. ఆడే ఓపిక లేదనే కదా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నా. అయినా.. జాతీయ జట్టుకు ఆడకుండా విరామం తీసుకుంటే.. రంజీలు ఆడమంటూ ఆదేశించడం ఏమిటో అర్థం కాలేదు.
నేను బాగుంటే గనుక ఇంటర్నేషనల్ క్రికెట్ కంటిన్యూ చేసేవాడిని కదా. అప్పుడు నేను డిప్రెషన్‌లో ఉన్నాను. ఈ రోజు కూడా అంతా బాగుందని చెప్పే పరిస్థితిలో లేను.
క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా. అయినా నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోందనే ప్రశ్న పదే పదే నా మదిని తొలుస్తోంది.
నేను బాగా ఆడుతున్నా.. కేవలం బ్రేక్ తీసుకున్నాననే కారణంగా ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు’’ అని ఇషాన్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నాడు.
కాగా రంజీలు ఆడకుండా ఎగ్గొట్టిన ఇషాన్ కిషన్.. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగడం గమనార్హం. ఈ సీజన్‌లో అతడు 14 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 320 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ అతడిని పరిగణనలోకి కూడా తీసుకోలేదు.
ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నారు. ఇక ఈ మెగా టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment