Ishan Kishan Double Hundred: పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. నిన్న (డిసెంబర్ 10) బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేల్లో సుడిగాలి ద్విశతకంతో (131 బంతుల్లో 210; 24 ఫోర్లు, 1 సిక్సర్లు) విరుచుకుపడి, పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన ఈ జార్ఖండ్ ఆటగాడు.. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడి పేరిట లేని ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా డైరెక్ట్‌గా డబుల్ సెంచరీ క్లబ్‌లో చేరిన తొలి ఆటగాడిగా ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కెరీర్‌లో తొమ్మిదో ఇన్నింగ్స్‌లోనే డబుల్ సాధించిన ఇషాన్.. ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా (24 ఏళ్ల 145 రోజులు), ఫాస్టెస్ట్ డబుల్ సెంచూరియన్‌గా (126 బంతులు) పలు రికార్డులు బద్దలు కొట్టాడు.
ఇషాన్.. డబుల్ సెంచరీని 9వ ఇన్నింగ్స్‌లోనే సాధించగా, ఈ ఘనత సాధించేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు 431 ఇన్నింగ్స్‌లు, టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌కు 234 ఇన్నింగ్స్‌లు, త్రీ టైమ్ డబుల్ సెంచూరియన్ రోహిత్ శర్మకు 103 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, కోహ్లి (113) సెంచరీతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.
అనంతరం 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు.. టీమిండియా బౌలర్ల దాటికి 182 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు.. కుల్దీప్, సుందర్, సిరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికి, సిరీస్ మాత్రం గెలవలేకపోయింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన భారత్.. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 14 నుంచి మొదలుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment