ఇప్పటికీ తప్పంతా ఆమెదేనా?: సిరాజ్‌ పోస్ట్‌ వైరల్‌ | 'Is It Still Her Fault': Siraj Strong Message Amid Protests Against Kolkata Incident | Sakshi
Sakshi News home page

తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్‌ పోస్ట్‌ వైరల్‌

Published Fri, Aug 16 2024 6:27 PM | Last Updated on Fri, Aug 16 2024 6:52 PM

'Is It Still Her Fault': Siraj Strong Message Amid Protests Against Kolkata Incident

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పురుషాధిక్య వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి దురాగతాల్లోనూ మహిళలదే తప్పంటారేమో అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఈసారి ఏ సాకు తప్పించుకుంటారో చెప్పాలంటూ నిందితులకు వంతపాడేవాళ్లకు చురకలు అంటించాడు.

ఈ మేరకు.. ‘‘జార్ఖండ్‌: జంషెడ్‌పూర్‌లో  మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై స్కూల్‌ వ్యాన్‌ డైవర్‌ లైంగిక దాడి. ‘బహుశా తనే ఇలా చేయమని అడిగిందేమో!’... రెండేళ్లుగా మైనర్‌ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్న తండ్రిని రాక్షసుడిగా అభివర్ణిస్తూ దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు.. అయినా, అపరిచితులతో ఫ్రెండ్లీగా ఉండవద్దని అమ్మాయిలకు చెబుతూనే ఉంటారు కదా!

మద్యం మత్తులో పట్టపగలే వైజాగ్‌లో మహిళపై అత్యాచారం...రాత్రుళ్లు బయటకు వెళ్లవద్దని.. అమ్మాయిలకు చెప్పినా వినరే!.. యాత్రకు వెళ్తున్న టీనేజర్‌పై సామూహిక అత్యాచారం.. ఏడుగురి అరెస్ట్‌...అమ్మాయిలను బార్లు, క్లబ్బులకు వెళ్లవద్దని చెప్తూనే ఉన్నారు కదా! అయినా ఇదేంటో?!’..

నన్‌పై లైంగికదాడి కేసులో బిషప్‌ను నిర్దోషిగా తేల్చారు..అసలు ఆమె ఎలాంటి దుస్తులు ధరించింది?’.. యూపీలో అత్యాచారానికి గురై 85 ఏళ్ల వృద్ధురాలి మృతి.. ‘తాగి ఉన్నదా ఏంటి?’... కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య... పశ్చిమ బెంగాల్‌లో మిన్నంటిన నిరసనలు... ‘అసలు తను అలాంటి వృత్తి ఎందుకు ఎంచుకున్నట్లు?’...

ఈసారి ఎలా తప్పించుకోబోతున్నారు? ఏం సాకులు వెదకబోతున్నారు? లేదంటే ఎప్పటిలాగే ఈసారీ ఆమెదే తప్పు.. మగాడు ఎల్లప్పుడూ మగాడే అంటారు కదా!?’’ అంటూ వివిధ ఘటనలకు సంబంధించిన వార్తా క్లిప్పింగులు, ఆ ఘటనల నేపథ్యంలో నిందితులకు మద్దతునిచ్చే వారి మాటలు ఎలా ఉంటాయో చెబుతూ చెంప చెళ్లుమనేలా వేసిన సెటైర్లను సిరాజ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు.

అత్యంత హేయమైన ఘటన
కాగా కోల్‌కతా ఆర్జీ కార్‌ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం విదితమే. అత్యంత హేయమైన రీతిలో డాక్టర్‌పై దారుణానికి పాల్పడ్డారు దుండగులు. దీంతో పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా అట్టుడుకుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఈ విస్మయకర ఘటనపై సిరాజ్‌ శుక్రవారం ఈ మేర పోస్ట్‌ పెట్టాడు.

ఇక శ్రీలంక పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ఈ హైదరాబాదీ పేసర్‌..తదుపరి దులిప్‌ ట్రోఫీ- 2024 టోర్నీతో బిజీ కానున్నాడు. టీమ్‌-బిలో అతడు చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టుకు బెంగాల్‌ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

చదవండి: అర్ధరాత్రిలో స్వతంత్ర పోరాటం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement