ఫుట్‌బాల్‌లో ఇటలీ జట్టుది చెరగని ప్రస్థానం. నాలుగుసార్లు (1934,1938,1982,2006 ) ఫిఫా చాంపియన్‌గా నిలిచిన ఇటలీ మరో రెండుసార్లు యూరోపియన్ చాంపియన్‌గా (1968,2020) అవతరించింది. గియాన్‌లుగీ బఫన్, పాలో మల్దిని, రాబర్టో బగ్గియో, ఫాఇయో కన్నావరో, ఫ్రానెస్కో టొట్టి, ఆండ్రియా పిర్లో, లుగీ రివా, గిసెప్పీ మియాజ్జా వంటి స్టార్ దిగ్గజ ఆటగాళ్లు ఇటలీకి ప్రాతినిధ్యం వహించారు.
కానీ ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం ఇటలీ ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది. మంగళవారం ఫిఫా క్వాలియర్స్ ప్లేఆఫ్స్ ఫైనల్లో బోస్నియాతో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అయితే పెనాల్టీ షూటౌట్‌లో ఇటలీ 1-4 తేడాతో బోస్నియా చేతిలో ఓటమి చవిచూసింది.
ఈ నేపథ్యంలో నాలుగుసార్లు ఫిఫా చాంపియన్ అయిన ఇటలీ వరుసగా మూడోసారి (2018, 2022, 2026) ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించని తొలి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతేకాదు 2006లో చివరిసారి ఫిఫా చాంపియన్‌గా నిలిచిన ఇటలీ అప్పటి నుంచి ఒక్క నాకౌట్ మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. మరోవైపు బోస్నియా జట్టు ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించడం ఇది రెండోసారి.
అయితే క్రికెట్‌లో ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఇటలీ తొలిసారి పాల్గొంది. ఆడుతుంది తొలి ప్రపంచకప్ అయినప్పటికీ తమ కంటే ఎన్నోరేట్లు మెరుగైన నేపాల్‌ను ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఇటలీ ఫుట్‌బాల్ ఆటలో మాత్రం తిరోగమనం దిశగా పయనిస్తోంది.
నిరసనలు..
ఇటలీ ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోవడంతో ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. నాలుగుసార్లు ఫిఫా విజేత అయిన ఇటలీ వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటలీ ఓటమిని తట్టుకోలేక కొంతమంది కన్నీటి పర్యంతమవ్వగా, మరికొందరు మాత్రం ఇటలీ ఫుట్‌బాల్ క్లబ్ అసోసియేషన్ వద్దకు చేరుకొని నిరసనలు చేపట్టారు.
🇧🇦: ✅✅✅✅
🇮🇹: ❌✅❌
BOSNIA BEAT ITALY ON PENALTIES AND WILL PLAY AT THE 2026 @FIFAWorldCup 🎉#WCQ | #EuropeanQualifiers pic.twitter.com/pgfeHWkENU— beIN SPORTS (@beINSPORTS_EN) March 31, 2026


