ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో ఓ మోస్తరు స్కోర్లు చేసిన ఈ ఇద్దరు (రోహిత్ 2&55, యశస్వి 73&37) తాజా ర్యాంకింగ్స్‌లో రెండ్రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 10, 11 స్థానాలకు ఎగబాకారు.
ఇదివరకే టాప్-10లో ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిది నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకగా.. భారత్‌తో నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జో రూట్.. మూడు నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని పదిలంగా కాపాడుకోగా.. స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారీ శతకంతో విరుచుకుపడిన ఆసీస్ ఆటగాడు కెమరూన్ గ్రీన్ ఏకంగా 22 స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. ఇవి మినహా తాజా ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేవీ జరగలేదు.
బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన నాథన్ లయోన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్‌తో టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన గ్లెన్ ఫిలిప్స్ 19 స్థానాలు మెరుగుపర్చుకుని 48వ స్థానానికి చేరాడు. టీమిండియా బౌలర్లు బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్‌వుడ్, కమిన్స్ 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఓ స్థానం తగ్గి ఏడో ప్లేస్‌కు పడిపోగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో టాప్-8 ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. రవీంద్ర జడేజా, అశ్విన్, షకీబ్, రూట్, అక్షర్ పటేల్, జేసన్ హోల్డర్, స్టోక్స్, జన్సెన్ టాప్-8లో కొనసాగుతుండగా.. విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు.
Comments
Please login to add a commentAdd a comment