
టెస్టు క్రికెట్‌కు ముందు వన్డేలతోనే అండర్సన్ అంతర్జాతీయ అరంగేట్రం జరిగింది. తొలి ఆరేళ్లు అతని కెరీర్ రెండు పార్శా్వలుగా సాగింది. ఒక్కసారి తనదైన జోరు మొదలైతే అద్భుతమైన బౌలర్‌గా కొన్ని సార్లు కనిపిస్తే... గతి తప్పాడంటే అతనికంటే చెత్త బౌలర్ మరెవరూ లేరన్నంతగా అనిపించేది. ప్రపంచంలో ప్రతీ బ్యాట్స్‌మెన్ అండర్సన్ బౌలింగ్‌ను అంతగా చితక్కొట్టారు. దాంతో జట్టులో చోటు కోల్పోవడం, వీటికి తోడు అదనంగా గాయాలు కలగలిసి అతడిని ఇబ్బందుల్లో పడేశాయి. ఎట్టకేలకు కొందరు సీనియర్ బౌలర్ల వరుస వైఫల్యాల తర్వాత 2007–08 న్యూజిలాండ్ పర్యటనతో పునరాగమనం చేసిన అండర్సన్ ఆ తర్వాత తన స్థాయిని పెంచుకుంటూ కీలకంగా మారాడు. కొద్ది రోజులకే సొంతగడ్డపై అదే జట్టుపై 7 వికెట్లు తీసి సత్తా చాటిన తర్వాత జిమ్మీకి తిరుగు లేకుండా పోయింది.
► పేస్ దళాన్ని నడిపిస్తూ...
2010నుంచి అండర్సన్ బౌలింగ్ మరింత పదునెక్కింది. జట్టు పేస్ బృందానికి నాయకుడిగా ఎదిగిన అతను దానికి తగినట్లుగా అద్భుత ప్రదర్శనలతో జట్టును గెలిపించాడు. సాంప్రదాయ స్వింగ్, సీమ్ కలగలిపి అతను అద్భుతాలు చేశాడు. ఇక పాతబడిన బంతి రివర్స్ స్వింగ్‌లో అతను చెప్పినట్లుగా ఆడింది. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, వరుసగా మెయిడిన్ ఓవర్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి వికెట్లు రాబట్టడం అతను తన శైలిగా మార్చుకున్నాడు. ఎలాంటి లోపాలు కనిపించకుండా సంపూర్ణ పేస్ బౌలర్ అనిపించుకున్న అండర్సన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ దృష్టిలో ప్రమాదకారిగా మారాడు. 2011లో ఇంగ్లండ్ గడ్డపై 0–4తో చిత్తుగా ఓడిన తర్వాత ధోని మాట్లాడుతూ... ‘మా రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అండర్సన్’ అని వ్యాఖ్యానించాడు. 2014 సిరీస్‌లో కూడా అతను విరాట్ కోహ్లిని ఎంతగా ఇబ్బంది పెట్టాడో అభిమానులెవరూ మరచిపోలేరు.
► తిరుగు లేని ప్రదర్శనలతో...
టెస్టు క్రికెట్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మెల్లగా దూరం కావడం ఇంగ్లండ్ క్రికెట్‌లో అతి సాధారణం. ఇదే తరహాలో పూర్తి స్థాయిలో టెస్టులపై దృష్టి పెట్టేందుకు అండర్సన్ 2015లో వన్డేలనుంచి తప్పుకున్నాడు. ఆ సమయానికే పలు టెస్టు రికార్డులు అతని ఖాతాలో వచ్చి చేరాయి. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా ఇయాన్ బోథమ్ రికార్డును అధిగమించిన అనంతరం 500 వికెట్లు మైలురాయిని కూడా దాటాడు. అప్పటి వరకు పేస్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న గ్లెన్ మెక్‌గ్రాత్ వికెట్ల సంఖ్యను అందుకున్న క్షణం కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయింది. పాతబడిన కొద్దీ రుచి పెరిగే వైన్ తరహాలో అండర్సన్ వయసు పెరిగిన కొద్దీ మరింత రాటుదేలాడు. అతని అద్భుతమైన గణాంకాలు అదే విషయం చెబుతాయి. అతని కెరీర్‌లో సగంకంటే ఎక్కువ (332) వికెట్లు 30 ఏళ్ల వయసు దాటిన తర్వాతే వచ్చాయి. 2014నుంచి ఆడిన 65 టెస్టుల్లో జిమ్మీ కేవలం 21.71 సగటుతో ఏకంగా 260 వికెట్లు పడగొట్టాడు. ఇది ఏ ప్రమాణాల ప్రకారం చూసినా అసాధారణ ప్రదర్శనే. ఇదే సమయంలో కనీసం 100 వికెట్లు తీసిన వారి జాబితా చూస్తే అతనే అగ్రస్థానంలో ఉండటం ఈతరం కుర్ర బౌలర్లతో పోలిస్తే ఎంత మెరుగో అర్థమవుతుంది.
‘వచ్చే ఏడాది చివర్లో జరిగే యాషెస్ సిరీస్‌లో నేను ఆడగలనని నమ్ముతున్నాను. నా ఆట బాగుంది. ఫిట్‌నెస్‌పై కూడా దృష్టిపెట్టాను కాబట్టి ఇది అసాధ్యమని నేను అనుకోవడం లేదు. ఇదే విషయాన్ని రూట్‌తో కూడా మాట్లాడాను. నాలో సత్తా ఉన్నంత వరకు ఆడతా. ఇప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదు. కొందరు 700 వికెట్ల గురించి అడుగుతున్నారు. ఎందుకు సాధించలేను. అదీ చేద్దాం. అయితే యాషెస్‌కు ముందు చాలా సిరీస్‌లు ఉన్నాయి. వాటిలో నేను పాల్గొనడం లేదా విశ్రాంతినివ్వడాన్ని ఈసీబీ నిర్దేశిస్తుంది. నా కెరీర్‌ను తిరిగి చూసుకుంటే ఇంత దూరం ప్రయాణిస్తానని అస్సలు ఊహించలేదు. తాజా ఘనత పట్ల నేను గర్వపడుతున్నాను’
–జేమ్స్ అండర్సన్
అద్వితీయం అండర్సన్ కెరీర్
‘రివర్స్ రివర్స్ స్వింగ్’ అనే మాటను ఎప్పుడైనా విన్నారా... ఆ బౌలింగ్ ఎలా ఉంటుందో ఒక్క మాటల్లో చెప్పాలంటే జిమ్మీ అండర్సన్ బౌలింగ్ చేసినట్లుగా ఉంటుంది. సాధారణ ఇన్‌స్వింగర్ తరహాలోనే మణికట్టును ఉంచుతూ రివర్స్ అవుట్ స్వింగర్‌ను సంధించడమే ఇది... బ్యాట్స్‌మన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టే ఈ శైలి ఒక్క అండర్సన్‌కు మాత్రమే సాధ్యమైంది. ఈ మాట చెప్పింది ఎవరో అల్లాటప్పా విశ్లేషకుడు కాదు. సాక్షాత్తూ సచిన్ అన్నాడంటే దాని విలువ, అండర్సన్‌పై ప్రశంస ఏమిటో అర్థమవుతుంది. కెరీర్‌లో అందరికంటే ఎక్కువగా 9 సార్లు మాస్టర్‌ను అవుట్ చేశాడు. ఇప్పుడు 600 టెస్టు వికెట్లు సాధించిన తొలి పేస్ బౌలర్‌గా ఘనత సృష్టించాడు.
– సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment