అంతర్జాతీయ క్రికెట్‌కు అండర్సన్ వీడ్కోలు
తొలి టెస్టులో విండీస్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం
లండన్: 21 సంవత్సరాల టెస్టు కెరీర్... 188 మ్యాచ్‌లు...40,007 బంతులు...704 వికెట్లు...26.45 సగటు...ఘనమైన ఆటకు ముగింపు లభించింది. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కెరీర్‌కు తెర పడింది. శుక్రవారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టుతో అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
2003 మే 22–24 మధ్య ఇదే లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు ఆడిన అండర్సన్ అక్కడే ఆటకు వీడ్కోలు పలికాడు. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో తన 12వ ఓవర్లో జోషువా డి సిల్వాను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేయడంతో అండర్సన్ ఖాతాలో చివరిదైన 704వ వికెట్ చేరింది. టెస్టుల్లో మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా... సచిన్ టెండూల్కర్ (200) తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడిగా ఈ దిగ్గజం సొంత అభిమానుల సమక్షంలో మైదానం వీడాడు.
మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 114 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 79/6తో ఆట కొనసాగించిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. 12.1 ఓవర్లలో ఆ జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. గుడకేశ్ మోతీ (31 నాటౌట్) మాత్రమే కొద్దిగా పోరాడగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అట్కిన్సన్ (5/61) విండీస్‌ను దెబ్బ తీశాడు. రెండో టెస్టు గురువారం నుంచి నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment